యువతికి ఇష్టం లేని పెళ్లి చేసిన పెద్దలు
ప్రేమికుడిని మరువలేక కుమిలిపోయిన వైనం
ప్రియుడితో కలిసి బలవన్మరణం
కూడ్లిగి తాలూకాలో కలకలం
సాక్షి,బళ్లారి: పరస్పరం ప్రేమతో బలపడిన వారి బందం వివాహం వరకు వెళ్లలేకపోయింది. పెద్దలను ఎదురించలేక మరో యువకుడితో కలిసి ఏడు అడుగులు నడిచింది. అయినప్పటికీ ప్రియుడిని మరువలేకపోయింది. మరణంతో అయినా ఒక్కటిగా ఈ లోకాన్ని వీడాలని నిర్ణయించుకున్న ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని కూడ్లిగి తాలూకాలో చోటు చేసుకుంది. కూడ్లిగి ఎస్ఐ మోహన్,స్థానికులు తెలిపిన వివరాలు మేరకు కూడ్లిగి తాలూకా గుడేకోట పోలీసుస్టేషన్ పరిధిలోని చిరుతగుండ గ్రామానికి చెందిన తిప్పేస్వామి(23),శోభిత(20)లు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.
అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాలవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈక్రమంలో శోభితకు పక్కనే ఉన్న మరియమ్మన హళ్లి అనే గ్రామానికి చెందిన చిదానందతో నాలుగు నెలల క్రితం పెళ్లి చేశారు. ఇష్టంలేని పెళ్లి చేశారని శోభిత కుమిలిపోయింది. తిప్పేస్వామిని మరువలేకపోయింది. రెండు రోజుల క్రితం పుట్టినిళ్లు చిరుతగుండకు వచ్చిన శోభిత.. ప్రియుడు తిప్పేస్వామితో కలిసి వెళ్లింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు,బంధువులు తీవ్రంగా గాలించడంతో మంగళవారం ఉదయం చిరుతగుండ సమీపంలో ఓ పొలంలో శోభిత, తిప్పేస్వామిలు చెట్టుకు ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు. కూడ్లిగి, గుడెకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.