చావుకోరిన ప్రేమ

23 Jul, 2020 08:23 IST|Sakshi
ఓంప్రకాష్‌ (ఫైల్‌)

బత్తలపల్లి మండలం యర్రాయపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లికి కులం అడ్డుగా నిలవడంతో అఘాయిత్యం

బాధిత కుటుంబాల్లో తీరని విషాదం

లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో.. వీడలేనంత దగ్గరయ్యాయి కన్నవాళ్లు.. కులం.. కట్టుబాట్లు.. అడ్డుతగిలాయి ఆ పసి మనసులు విలవిల్లాడిపోయాయి ఎడబాటును తట్టుకోలేకపోయాయి వీడిపోలేక.. వీడి ఉండలేక... చావులో ఒక్కటవుదామనుకున్నారు భవిష్యత్‌ తలచుకుని భయాందోళన చెందారు పురుగుల మందునే ప్రేమామృతంగా తాగారుఆస్పత్రికి తీసుకెళ్లినా ఒకరి తర్వాత మరొకరు తనువు చాలించారుశృతి తప్పిన ప్రేమ ప్రకాశించకపోగాకన్నవారికి కడుపుకోత మిగిలింది.

బత్తలపల్లి: తమ వివాహానికి కులాలు అడ్డు వస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ధర్మవరం రూరల్‌ సీఐ వీసీ పెద్దయ్య తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన గొడ్డుమర్రి చిన్నపోతులయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు ఓంప్రకాష్‌(18), అదే గ్రామానికి చెందిన మనోహర్, సావిత్రి దంపతుల కుమార్తె శ్రుతి(18).. ధర్మవరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇటీవల తల్లిదండ్రులకు తెలిసి కులాలు వేరుకావడంతో పెళ్లి చేయడం కుదరదని, ఈ విషయాన్ని ఇంతటితో వదులుకోవాలంటూ మందలించారు.

దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బుధవారం వేకువజామున 5.30 గంటలకు యువకుడి తోటలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆరు గంటలకు యువకుడి సమీప బంధువులు తోటలో బెండకాయలు కోయడానికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే ఇరువైపుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ముందు యువకుడు.. ఆ తర్వాత యువతి మృతి చెందారు. ఘటనపై ధర్మవరం రూరల్‌ సీఐ పెద్దయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు