10 ఏళ్ల క్రితం వివాహం.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం!

23 Nov, 2018 11:45 IST|Sakshi
మృతి చెందిన శ్రావణ్‌కుమార్‌ ,ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య

ప్రియుడు మృతి

ప్రియురాలి పరిస్థితి విషమం

నంద్యాలలో ఘటన

సోషల్‌ మీడియాద్వారా పరిచయం

పెళ్లి చేసుకోవాలని వచ్చి అఘాయిత్యం

వైఎస్‌ఆర్‌, నంద్యాల: సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. అది ప్రేమగా మారింది. ఆమెకు అప్పటికే వివాహమైంది. అయినప్పటికీ ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అయితే..ఇంతలోనే ఏం జరిగిందో కానీ ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రియుడు మృతి చెందగా..ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురువారం కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. రైల్వే పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రఫీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన విద్యుత్‌ శాఖ ఏడీఏ రఘుతో దివ్యకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. పైగా వయసులో 23 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

ఇదిలా ఉండగా.. అదే జిల్లా ప్రొద్దుటూరులోని దొరసానిపల్లె వీధికి చెందిన బండారు శ్రావణ్‌కుమార్‌(26) నెల్లూరులో ఏపీ జెన్‌కోలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి, దివ్యకు ఏడాది క్రితం సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరు అప్పుడప్పుడు కలుసుకొనే వారని స్థానికులు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు. భార్య అదృశ్యమైందని దివ్య భర్త రఘు పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి జాడ ఎవరికీ కనిపించలేదు. పెళ్లి చేసుకోవడానికే  ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. గురువారం ఉదయం తిరుపతి నుంచి రైలులో నంద్యాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. శ్రావణ్‌కుమార్‌ తన బంధువులకు ఫోన్‌ చేసి తాను బతకనని, పురుగు మందు తాగుతున్నానని  తెలిపాడు. తాము మాట్లాడతామని వారు చెప్పినా వినకుండా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. అనంతరం రైల్వేస్టేషన్‌ వెలుపల కూల్‌డ్రింక్స్‌ కొనుగోలు చేసి.. అందులో పురుగు మందు కలుపుకొని ఇద్దరూ తాగారు. తర్వాత రైల్వేస్టేషన్‌లోకి వెళుతూ స్టేషన్‌ ఆవరణలోనే పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ రాగానే నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడ పోలీసులకు వారి పేర్లు, అడ్రస్‌ తెలిపి తామిద్దరం ప్రేమించుకున్నామని మాత్రమే చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా కోలుకోలేక శ్రావణ్‌కుమార్‌ మృతి చెందాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రావణ్‌కుమార్‌ తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ రఫీ తెలిపారు.

మరిన్ని వార్తలు