విడదీస్తారని.. తనువు వీడారు

24 Nov, 2019 10:44 IST|Sakshi
రోదిస్తున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు

దుద్దెనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

ఓ వేడుకలో ఏర్పడిన పరిచయం ప్రేమగా..

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని అఘాయిత్యం

సైదాపూర్‌(హుజూరాబాద్‌):  ఓ వేడుకలో ఏర్పడిన పరిచయం.. స్నేహంగా మారింది. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లుగా ప్రేమాయణం సాగించారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేదు. చెప్పినా పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డారు. విషయం పెద్దలకు తెలిస్తే తమను విడదీస్తారని.. వీడిపోయి బతకడం కన్నా.. కలిసి చావడమే మేలనుకున్నారు. క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాకూర్‌ వీరాసింగ్‌ ఏడాది పసికందుగా వరంగల్‌ జిల్లా కాశిబుగ్గ పోలీసులకు దొరికాడు. పోలీసుల తమదగ్గర పని చేస్తున్న ఠాకూర్‌ ప్రతాప్‌సింగ్‌–శోభారాణి దంపతులకు పెంపకానికి ఇచ్చారు. అప్పటికే ఈ దంపతులకు చిన్న కూతురు ఉంది.

వీరాసింగ్‌ను పెంపకానికి తీసుకున్న కొద్ది రోజులకే శోభారాణి–ప్రతాప్‌సింగ్‌లు మృతిచెందాడు. ప్రతాప్‌సింగ్‌ బావ రాణాప్రతాప్‌సింగ్‌–బేబీబాయి వీరాసింగ్‌తో పాటు పాపను దుద్దెనపల్లికి తీసుకొచ్చారు. బడీడుకు వచ్చాక ఇద్దరిని హుస్నాబాద్‌ హాస్టల్‌లో చదివించారు. పాప హాస్టల్‌ నుంచి పారిపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లేదు. 5వ తరగతి వరకు చదువుకున్న వీరాసింగ్‌(25) చదవు మానేశాడు. లారీ డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. కొన్నేళ్లుగా లారీ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఎలిగేడు మండలం నారాయణపల్లికి చెందిన యాదగిరి సంపత్‌–స్వప్న కూతురు లయమాధురి(19) 8వ తరగతి చదివి మానేసింది. లయమాధురి, వీరాసింగ్‌లు ఓ ఫంక్షన్‌లో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది.

రెండేళ్ల ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పడానికి ధైర్యం చాలలేదు. దీంతో గురువారం రాత్రి 12.30 గంటలకు దుద్దెనపల్లిలో క్రిమిసంహారకమందు తాగారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే బంధువులు హుజూరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు లయమాధురి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వరంగల్‌ ఆస్పత్రి నుంచి లయమాధురిని కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లయమాధురి శనివారం రాత్రి 1.45 గంటలకు, వీరాసింగ్‌ ఉదయం 5.30 గంటలకు మృతి చెందారు.  
 

మరిన్ని వార్తలు