రైలుకు ఎదురుగా వెళ్లి ప్రేమజంట ఆత్మహత్య 

20 Nov, 2019 08:37 IST|Sakshi

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు 

సాక్షి, చెన్నై : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న వేదనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి వేగంగా దూసుకొచ్చిన  రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురుగా వెళ్లి బలన్మరణానికి పాల్పడ్డారు. బన్రూటిలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మారి అలియాస్‌ మదన్‌(22). ఇతను మెకానిక్‌గా ఓ షెడ్డులో పనిచేస్తున్నాడు. తోరపాటి గ్రామానికి చెందిన పాండురంగన్‌ కుమార్తె స్వాతి అలియాస్‌ శ్వేతను మదన్‌ ప్రేమిస్తున్నాడు.

రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో తరచూ శ్వేత ఇంటికి సైతం మదన్‌ వెళ్లి వచ్చేవాడు. అంతే కాదు, నర్సింగ్‌ చదువుతున్న స్వేతను సాయంత్రం వేళల్లో తన మోటార్‌ సైకిల్‌ మీద ఇంటికి తీసుకెళ్లి మరీ దిగబెట్టి వచ్చేవాడు. ఈ ఇద్దరు ప్రేమించుకున్న విషయం కుటుంబీకులకు తొలుత తెలియదు. అయితే, తమ ప్రేమను కుటుంబీకులు  అంగీకరిస్తారా..? అన్న ఆందోళన వీరిని వెంటాడుతూ వచ్చింది. ఏడాది కాలంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట తాము జీవితంలో ఒక్కటయ్యేది అనుమానమే అన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఎట్టకేలకు ధైర్యం చేసి కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లినా, వారు అంగీకరించక పోవడంతో బలన్మరణానికి సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో సోమవారం కళాశాలకు వెళ్లిన శ్వేత తిరిగి ఇంటికి రాలేదు. అయితే, ఆమె చదువుకుంటున్న కళాశాల ఆస్పత్రిలో ట్రైనింగ్‌ నిమిత్తం చేరి ఉండటంతో అప్పుడప్పడు రాత్రుల్లో ఇంటికి వచ్చేది కాదు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రి విధులకు వెళ్లి ఉంటుందని భావించారు.  

పట్టాలపై మృతదేహం..... 
మంగళవారం ఉదయం శ్వేత, మదన్‌ల మృత దేహాలు రైల్వే ట్రాక్‌ వద్ద పడి ఉన్నట్టుగా సమాచారం అందుకున్న రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. అస్సలు ఏంజరిగిందోననే ఆందోళనతో కుటుంబీకులు పరుగులు తీశారు. అయితే, ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అర్థరాత్రి సమీపంలో చెన్నై నుంచి రామేశ్వరం వైపుగా వెళ్లిన ఎక్స్‌ప్రెస్‌ రైలు డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు కనిచ్చ పాక్కం రైల్వే గేట్‌ సమీపిస్తున్న సమయంలో అతి వేగంగా దూసుకొస్తున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ ముందుగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఓ జంట ఎదురు వచ్చినట్టు , హారన్‌ కొట్టినా, వేగం తగ్గించే యత్నం చేసినా ఫలితం లేదని తిరుపాతి పులియూర్‌ రైల్వే పోలీసులకు ఆ డ్రైవర్‌ సమాచారం అందించి వెళ్లాడు. రైలు అతి వేగంగా వచ్చిన దృష్ట్యా, ఆ ఇద్దరి మృత దేహాలు చిద్రం అయ్యాయి. మృత దేహాల్ని కడలూరు ఆస్పత్రి మార్చురికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. ఈ ఘటన ఆయా కుటుంబాలు, గ్రామాల్లో విషాదాన్ని నింపింది. 

మరిన్ని వార్తలు