‘కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’

21 Dec, 2019 11:57 IST|Sakshi
మృతి చెందిన గౌతమి (ఫైల్‌)

యువతి మృతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు

వయసు వ్యత్యాసంతో భయపడి..

తెంపల్లిలో విషాదఛాయలు

సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్‌): ‘ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నాం.. మా పెళ్లిని సమాజం హర్షించదు. కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’ అని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో చోటుచేసుకుంది. ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గన్నవరం మండలం తెంపల్లికి చెందిన నాగబోయిన గౌతమి (28), వెంట్రప్రగడకు చెందిన లోకేశ్‌(19) ఇద్దరు సుమారు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గౌతమి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, లోకేశ్‌ పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నా ప్రేమించుకున్నారు.

ఇదిలా ఉండగా క్రిస్మస్‌కి దుస్తులు కోసమని చెప్పి గురువారం ఉదయం గాంధీనగర్‌లో ఒక హోటల్‌లో రూం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో షాపింగ్‌ వెళతామని హోటల్‌ నిర్వాహకులకు చెప్పి ఆ సమయంలో కాలింగ్‌ బెల్‌ పెట్టాలని కోరారు. రాత్రి అయినా వారు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో నిర్వాహకులు అనుమానంతో సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాలమురళీకృష్ణ, ఎస్‌ఐలు సత్యనారాయణ, విమల ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలకొట్టారు. లోపల వారు మంచంపై గౌతమి విగతాజీవిగా పడిఉండగా, యువకుడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలం నుంచి యువతిని పోస్టుమార్టానికి తరలించగా లోకేశ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

గౌతమి అంత్యక్రియలు పూర్తి
తెంపల్లె (గన్నవరం రూరల్‌): మండలంలోని తెంపల్లెలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామానికి చెందిన నాగబోయిన గౌతమి (28) విజయవాడలోని లాడ్జిలో విషం తీసుకుని మృతి చెందటం గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన రైతు నాగనబోయిన వెంకటరావు కుమార్తె గౌతమి  చిన్నతనం నుంచి అందరితో ఎంతో మర్యాదగా నడుచుకునేదని స్థానికులు బెబుతున్నారు. ఎంటెక్‌ చదివి ఉద్యోగం చేసుకుంటూ ఎంతో వినయంగా ఉండే గౌతమి  మృతి చెందటాన్ని బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటరావుకు ఇద్దరు సంతానం కాగా గౌతమి కుమార్తె. ఆమెకు అన్నయ్య ఉన్నాడు.

గత నవంబరు నెలలో ఆమెకు నిశ్చితార్ధం జరిగింది. వచ్చే నెల వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఇంతలో ఈ విధంగా జరగటంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో గౌతమి విషం తీసుకుని చనిపోయిందని పోలీసుల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు నివ్వెరపోయారు. హుటాహుటిన విజయవాడకు వెళ్లారు. తెంపల్లెకు సమీపంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆమె అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. అయితే వివాహం విషయంలో తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు నచ్చకపోవటమే గౌతమి మృతికి కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. గౌతమి మృతదేహానికి శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా