వివాహితతో ప్రేమ.. పెద్దలు అడ్డు చెప్పడంతో

26 Oct, 2019 16:02 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఇష్టపడిన మహిళతో పెళ్లికి అడ్డంకులు ఎదురవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన సురేష్‌ అదే గ్రామానికి చెందిన వివాహిత రాయల్ నాగమణిని ప్రేమలోపడ్డాడు. భర్తతో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా ఉంటున్న నాగమణికి తోడుగా ఉంటానని, ఆమె బిడ్డకు తండ్రిలేని లోటు తీరుస్తానని బాసచేసాడు. దాంతో వయసులో చిన్నవాడైనప్పటికీ సురేష్‌ ప్రేమకు నాగమణి సరేనంది.

దీంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇద్దరిమధ్యా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈనేపథ్యంలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే, సురేష్‌ కుటుంబ సభ్యులు నాగమణితో పెళ్లికి ససేమిరా అన్నారు. వయసులో పదేళ్లు పెద్దది, ఒక బిడ్డకి తల్లి అయిన వివాహితతో పెళ్లేంటని మందలించారు. వారికి నచ్చజెప్పేందుకు సురేష్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో మనస్తాపానికి గురైన సురేష్ ప్రియురాలు నాగమణితో విషయం చెప్పాడు. ఇద్దరూ ఊరినుంచి పారిపోయారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం తమ్మిలేరు రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.


ప్రాణాలు విడిచిన సురేష్‌, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగమణి

అయితే, ప్రేమ జంట రిజర్వాయర్‌లోకి దూకడం చూసిన మత్స్యకారులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. నీట మునిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నాగమణిని కాపాడగలిగారు. కానీ, సురేష్ మాత్రం గల్లంతయ్యాడు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నాగమణిని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. గజ ఈతగాళ్లని రిజర్వాయర్‌లోకి దింపి సురేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. కాటికి పంపాల్సిన కొడుకు కడుపుకోత మిగిల్చాడని  అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా