‘రయ్‌’మన్న మోసం!

6 Aug, 2019 11:22 IST|Sakshi
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు 

కార్లు, బైక్‌లు ఇస్తామంటూ వసూళ్లు  

లక్కీడిప్‌ పేరుతో రూ.10 కోట్లకు ఎగనామం 

నంద్యాలలో 500 మందికిపైగా బాధితులు   

సాక్షి, కర్నూలు: ‘అదృష్టవంతులు మీరే.. చిన్న మొత్తాన్ని చెల్లించండి.. కార్లు..బైక్‌లు పొందండి..విదేశాల్లో టూర్లు వేయండి’ అంటూ అరచేతిలో స్వర్గం చూపాడు. సినీ తారలతో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరినీ నమ్మించాడు. రూ.10 కోట్ల వరకు డబ్బు మూటగట్టుకొని ఉడాయించాడు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా నంద్యాల పట్టణంలో వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు.. పద్మావతినగర్‌లో ఉన్న జేవీసీ బైక్‌ షోరూం యజమాని మనోహర్‌ కొంత కాలంగా లక్కీడిప్‌ ద్వారా ప్రజలకు బైక్‌లు అందజేసే వాడు. ఈ క్రమంలో కస్టమర్లు పెరిగిపోయారు. మరికొంత మందిని ఆకర్షించేందుకు సినీతారలను పట్టణానికి పిలిపించి వారితో లక్కీడిప్‌ తీయించేవాడు. కస్టమర్లు పెరగటంతో వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. బైక్‌ల కోసం రూ.10 వేల నుంచి 20 వేల వరకూ వసూలు చేయగా కార్ల కోసం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మేర తీసుకున్నాడు. కొంత కాలం తర్వాత వాహనాలు ఇవ్వకపోవటంతో డబ్బు అయినా తిరిగి ఇవ్వాలని బాధితులు నిలదీసినా స్పందన కరువైంది.

షోరూం యజమానులూ బాధితులే... 
జేవీసీ షోరూం యజమాని మనోహర్‌ సబ్‌డీలర్‌ కావటంతో ఇతర షోరూంల నుంచి బైక్‌లు కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలో ఇతర షోరూం యజమానుల వద్ద కూడా లక్షల రూపాయల్లో అప్పు చేశాడు. కస్టమర్లకు బైక్‌లు ఇచ్చే క్రమంలో జాప్యం రావటంతో వ్యాపారం కొంత తగ్గుముఖం పట్టింది. జల్సాలకు అలవాటు పడటంతో అందినకాడికి అప్పులు చేశాడు. ప్రవేటు వ్యక్తుల వద్ద చిట్టీలు వేసి నగదు చేసుకుని వారికి ఎగనామం పెట్టాడు.

ఒత్తిళ్లు భరించలేకే ఉడాయించాడా? 
షోరూం నిర్వాహణ.. మరో వైపు కస్టమర్ల ఒత్తిడి భరించలేక అందినాడికి అప్పులు తీసుకున్నాడు. చిట్టీలు నష్టానికి పాడి ఆ డబ్బుతో సర్దుబాటు చేయటం మొదలు పెట్టాడు. పట్టణంలోని వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రునం తీసుకోవటంతో నెలనెలా వడ్డీకోసం వారి ఒత్తిళ్లు ఒకవైపు ఉండేది. ఇలా రెండేళ్లుగా అప్పుల వారికి నచ్చచెబుతూ కాలం వెళ్లబుచ్చాడు. రానురాను అప్పులు కోట్లకు చేరటంతో వడ్డీలు కట్టడం కూడా కష్టంగా మారింది. ఒత్తిడి చేసే వారికి పోస్ట్‌పెయిడ్‌ చెక్కులు ఇచ్చి శాంతింప జేసేవాడు. పోస్ట్‌పెయిడ్‌ ఇచ్చాడు కదా అని సంతృప్తిపడి అప్పుల వారు వెనుదిరిగి వెళ్లిపోయేవారు. ఇదే అదనుగా అడిగిందే మొదలు అందరికి చెక్కులు ఇవ్వటం మొదలు పెట్టాడు.

అందరికీ ఒక నెల గడువు అడిగి ఎవ్వరికీ తెలియకుండా ఇల్లు కూడా అమ్మేశాడు. మరికొన్ని ఆస్తులు కూడా అమ్మి  నాలుగు రోజుల క్రితం చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి ఉడాయించాడు. నాలుగు రోజులుగా షోరూం తెరవక పోయేసరికి అనుమానం వచ్చి ఇంటి వద్ద విచారిస్తే అసలు నిజం బయటపడింది. నాలుగు రోజుల కిందట ఇంటికి తాళం వేసి Ðవెళ్లిపోయారన్న సమాచారం తెలియటంతో భాధితులు లబోదిబోమన్నారు. చెక్కులు తీసుకుని బ్యాంకుకు వెళితే బ్యాంక్‌ ఖాతాలో చిల్లి గవ్వలేక పోవటంతో పోలీసులను ఆశ్రయించారు. నంద్యాల పట్టణంలో బాధితులు 500 మందికి పైగానే ఉన్నారు. వీరి ఫిర్యాదు మేరకు.. చీటింగ్, చిట్‌ఫండ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి నట్లు టూటౌన్‌ ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు