ప్రాజెక్ట్ పేరిట కుచ్చుటోపీ

28 Nov, 2019 11:27 IST|Sakshi

పలమనేరులోని మా బ్రాండ్‌ టెక్నాలజీస్‌ మోసం

బాధితుడు నెల్లూరు వాసి

పోలీసులకు ఫిర్యాదు

పలమనేరు: ప్రాజెక్టు వర్క్‌ ఇస్తామంటూ తెలివిగా నమ్మించి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి లక్షలు దండుకున్నారు. ఈ ఘటన బుధవారం పలమనేరులో  వెలుగుచూసింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం..పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన తేజ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. బజారువీధిలో మా బ్రాండ్‌ టెక్నాలజీస్‌( మా సలహాలతో మీ వ్యాపారం రెట్టింపు)అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థను ప్రారంభించాడు. ఇందులో సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులు, పర్సనల్‌ లోన్లు, వెబ్‌సైట్లు, యాప్స్‌ సేవలుంటాయని బోర్డు పెట్టాడు. దీంతో నెల్లూరుకు చెందిన దినేష్‌మూర్తి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వీరితో వ్యాపార లావాదేవీలు మాట్లాడారు. తమ వద్ద యూఎస్‌ కంపెనీకి చెందిన ప్రాజెక్టు వర్క్‌ ఉందని, దానిని నెల్లూరులో చేసి తమకు పంపితే ఖాతాకు డబ్బులేస్తామంటూ తేజ ఒప్పందం చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్, ఎక్స్‌ఎల్‌ షీట్‌లను పంపాడు. ఈ పనులు చేసినందుకు దినేష్‌మూర్తికి డబ్బులు ఆన్‌లైన్‌లో వేస్తూ నమ్మకం కలిగించాడు. ఆపై మరో ప్రాజెక్టు ఇస్తానంటూ రూ.7.60లక్షలు దినేష్‌మూర్తి నుంచి తీసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించిన ఒరిజినల్‌ ఐడీలు కాకుండా డూప్లికేట్‌ ఐడీలను తేజ ఇవ్వడంతో మోసపోయామని బాధితుడు తెలుసుకుని పలమనేరుకు వచ్చి అతడిని నిలదీశాడు. త్వరలో సెటిల్‌ చేస్తానన్న తేజ ఆ తర్వాత డబ్బుల్వికపోవడంతో బాధితుడు బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పేరిట తేజ, అతని అన్న చంద్ర, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ హయాత్, డాటా ట్రాన్స్‌ఫరర్‌ బాలాజీతో కలసి తమను మోసం చేశాడని పోలీసులకు బాధితుడు వివరించాడు. ఆధారాలను పరిశీలించిన ఎస్‌ఐ ప్రియాంక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా బాధితులు ఎందరున్నారో దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా