గుంటూరు రైతులకు మదనపల్లెవాసి టోపీ

28 Feb, 2018 09:57 IST|Sakshi
నిందితున్ని అదుపులోకి తీసుకుంటున్న గుంటూరు పోలీసులు (ఇన్‌సెట్‌లో) నిందితుడు కోడికాళ్ల అమరనాథ్‌

రూ.33 లక్షలకు చెల్లని చెక్కులు ఇచ్చిన వైనం

నిందితుడిని అరెస్టుచేసి తీసుకెళ్లిన పోలీసులు

మదనపల్లె క్రైం : గుంటూరులోని వేరుశనగ రైతుల్ని మదనపల్లెకు చెందిన వ్యక్తి  భారీగా మోసగించాడు. 1,650 బస్తాల వేరుశనగకాయల్ని తీసుకుని 33 లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చాడు.అవి చెల్లకపోవడంతో రైతులు అక్కడి ఎస్పీని ఆశ్రయించడంతో పోలీసులు నిందితుడిని మంగళవారం మదనపల్లెలో అరెస్టుచేసి గుంటూరుకు తరలించారు. గుంటూరు జిల్లా పోలీసులు వెంకటేశ్వరులు, రాజేంద్ర ప్రసాద్‌ కథనం మేరకు  వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె ఎస్‌బీఐ కాలనీకి చెందిన కోడికాళ్ల అమరనాథ్‌ గుంటూరు జిల్లా చెరుకుపల్లె మండలం రామబట్ల గ్రామానికి చెందిన రైతులు పి.గోపాల్‌రెడ్డి, రాఘవ, మరొ 18 మంది వద్ద 1,650 బస్తాల వేరుశనగకాయలను రూ.40 లక్షలకు తొమ్మిది నెలల క్రితం కొన్నాడు. 

రూ.7 లక్షలు నగదు ఇచ్చి..మిగతా సొమ్ముకు చెక్కులు ఇచ్చాడు. అప్పటి నుంచి అమరనాథ్‌ ఆచూకీలేదు. చెక్కులు చెల్లలేదు. మోసపోయామని తెలుసుకున్న రైతులు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. పోలీసులు  అమరనాథ్‌పై కేసులు నమోదుచేశారు. ఈ నేపథ్యంలోనే బాధిత రైతులు వారం  క్రితం అమరనాథ్‌ ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించాలని నిలీదీశారు. అయితే అతడు డబ్బు ఇవ్వకుండా తప్పించుకుని పరారయ్యాడు. బాధితులు ఆ ఇంటికి సమీపంలోనే కాపలా ఉండి సమాచారం ఇవ్వడంతో సోమవారం రాత్రి మదనపల్లెకు వచ్చారు. వారిని గమనించిన అమరనాథ్‌ గోడ దూకి పారిపోగా,  వెంటపడి స్థానిక కోర్టు సమీపంలో పట్టుకున్నారు. ఒకటో పట్టణ సీఐ నిరంజన్‌కుమార్, ఎస్‌ఐ సుమన్‌ ఎదుట హాజరుపరచి కేసు వివరాలను చూపించి అనంతరం నిందితుడిని గుంటూరుకు తరలించారు.

నిందితుడిపై ఇలా ఎన్నో చీటింగ్‌ కేసులు
కోడికాళ్ల అమరనాథ్‌ అలియాస్‌ అమర(40) స్వగ్రామం పీటీఎం(పెద్దతిప్పసముద్రం) మండలం పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లె. ఇతనిపై మరిన్ని చీటింగ్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఏడాది క్రితం ప్రకాశం జిల్లా పామురులోని కొందరు రైతులతో పాటు హోల్‌సేల్‌ వ్యాపారి కోవూరి వెంకటసుబ్బయ్య వద్ద రూ.22 లక్షలకుపైగా విలువజేసే వివిధ రకాల ధాన్యాన్ని కొన్నాడు. అందుకుగాను డబ్బు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులను రైతులు బ్యాంకులకు తీసుకెళితే చెల్లలేదు. ఆ మేరకు బాధితులు పామూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్‌ కేసు నమోదుచేశారు. నిందితుని కోసం ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నామని సీఐ, ఎస్‌ఐ సెల్‌ నంబ ర్లు 9440627178, 9440627179కు సమాచా రం అందించాలని కోరుతూనే ఉన్నారు. అలా గే కర్నూలు జిల్లాలోని తాండూరుకు చెందిన  రైతు గోవిందు దగ్గర 23 టన్నుల కందులు తీసుకొచ్చి చెల్లని చెక్కులు ఇచ్చాడని బాధితు డు రెండు నెలల క్రితం టూటౌన్‌లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్‌ కేసు నమోదైంది. ఇలా రైతులను మోసగిస్తున్న అతడు టీడీపీ నాయకుడిగా మదనపల్లె, పీటీఎం, బి.కొత్తకోట మండలాల్లో చెప్పుకుంటున్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు