యువతులకు ఆడంబర జీవితం, డబ్బాశ చూపి

26 Sep, 2019 10:17 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రస్తుతం సెక్స్‌ రాకెట్‌ కుంభకోణం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12మంది బ్యూరోక్రాట్లు, 8మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్‌ వెల్లడించింది. వీరిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్‌ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రదారి అయిన శ్వేతా జైన్‌ను ప్రస్తుతం సిట్‌ విచారిస్తుంది. ఈ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ హనీట్రాప్‌లోకి కాలేజీ విద్యార్థినులను ఎలా భాగం చేస్తున్నారు.. ఆనక వారితో చేయించే అకృత్యాలు, తద్వారా తాము పొందే లాభాల గురించి శ్వేతా జైన్‌ సిట్ ముందు వెల్లడించింది. ఆ వివరాలు.. శ్వేతా జైన్‌ భర్త  స్వాప్నిల్ జైన్ ఓ ఎన్జీవోను ప్రారంభించాడు. ముందుగా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకుంటుంది. ఆ ఇళ్లలో ఉన్న చదువుకునే, యుక్త వయసు అమ్మాయిలకు జాబ్‌ ఇప్పిస్తాను, చదువుకునేందుకు సాయం చేస్తామంటూ మాయమాటలు చెప్తుంది.

ఆడంబర జీవితం, డబ్బు రుచి చూపి..
అందుకు ఆ కుటుంబం ఒప్పుకుంటే.. ఆ తర్వాత శ్వేతా జైన్‌ రంగంలోకి దిగుతుంది. నెమ్మదిగా సదరు యువతులకు ఆడంబరమైన జీవితాన్ని రుచి చూపిస్తుంది. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి.. తాను చెప్పినట్లు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశపెడుతుంది. ఆ తర్వాత వారిని నెమ్మదిగా తన సెక్స్‌ రాకెట్‌ కోసం వాడుకుంటుంది. అలా కాలేజీకి వెళ్లే యువతులను రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు ఎర వేస్తుంది. ఆ అధికారులు, నాయకుల కోరిక మేరకు సదరు యువతులను వారి వెంట టూర్‌లకు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు పంపేది. అనంతరం వారు శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియో తీసేది. ఆ తర్వాత ఈ వీడియోలను చూపించి సదరు అధికారులను, నాయకులను బ్లాక్‌మెయిల్‌ చేసి భారీ కాంట్రాక్టులు, ఎన్జీవోకు అధిక మొత్తంలో విరాళాల రూపంలో డబ్బు సంపాదించేది. ఒక్కసారి శ్వేతా జైన్‌ చేతిలో పడిన యువతులు ఈ ఉచ్చు నుంచి బయటకు రావడం కష్టం. శ్వేత చేస్తున్న అక్రమాల గురించి పోలీసులకు గానీ, మీడియాకు గానీ చెప్పాలని చూస్తే.. వారి వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించేది. దాంతో యువతులు కూడా కామ్‌గా ఉండేవారు. ఇలా సాగుతున్న శ్వేతా జైన్‌ అక్రమాలకు ఓ ఇంజనీర్‌ ఇచ్చిన ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది. తీగ లాగడంతో డొంక అంతా కదిలింది.

గొప్ప కాలేజీలో సీటు ఇప్పిస్తానని..
ఈ క్రమంలో మౌనిక అనే భాదితురాలు మాట్లాడుతూ.. ‘ఇంటర్‌ పూర్తయ్యాక నేను ఉన్నత విద్య అభ్యసించాలని ఆశించాను. కానీ నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఈ క్రమంలో శ్వేతా జైన్‌ భర్త నా తండ్రిని కలిసి.. తన ఎన్జీవో ద్వారా నేను చదువుకోడానికి సాయం చేస్తానని చెప్పాడు. మంచి పేరున్న కాలేజీలో సీటు ఇప్పిస్తానని.. నన్ను భోపాల్‌ పంపిచాల్సిందిగా కోరాడు. మా నాన్న అంగీకరించడంతో నన్ను భోపాల్‌ తీసుకెళ్లారు. అక్కడ నన్ను ఓ పాష్‌ హోటల్‌లో ఉంచారు. తిరగడానికి బీఎండబ్ల్యూ కార్‌ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా వారి ప్లాన్‌ను నాకు వివరించారు. ఎంతో డబ్బు వస్తుందని.. ఫలితంగా నా కుటుంబ ఆర్థిక అవసరాలు అన్ని తీరతాయని నన్ను ప్రలోభాలకు గురి చేశారు. పైగా నన్ను మంచి కాలేజీలో చేర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత శ్వేతా జైన్‌ నన్ను సెక్రటేరియట్‌ వద్దకు తీసుకెళ్లి పెద్ద పెద్ద అధికారులను నాకు పరిచయం చేసింది. వారి ద్వారా నాకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మించింది. అలా నన్ను దీనిలో ఇరికించింది’ అంటూ మౌనిక వాపోయింది.

చదవండి: సెక్స్‌ రాకెట్‌; మాజీ సీఎం సహా ప్రముఖుల పేర్లు!

రూ. 3కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరింపు...
‘ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 30న శ్వేతా, ఆమె సహాయకులు ఆర్తి దయాల్‌, రూప నన్ను ఓ పాష్‌ హోటల్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం వారు నన్ను ప్రభుత్వ ఇంజనీర్‌ హర్భజన్‌ సింగ్‌ దగ్గరకు పంపించారు. హోటల్‌ గదిలో మేం శృంగారంలో పాల్గొంటుండగా ఆర్తి దయాల్‌ వీడియో తీశాడు. తర్వాత దాన్ని హర్భజన్‌కు చూపించి తనకు రూ. 3కోట్లు ఇవ్వాల్సిందిగా శ్వేత బ్లాక్‌మెయిల్‌ చేసింది. కానీ ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్తే.. వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తానని శ్వేత నన్ను బెదిరించింది. దాంతో నేను మౌనంగా ఉన్నాను. శ్వేత దగ్గర నాలాంటి కాలేజీ యువతులు ఓ రెండు డజన్ల మంది ఉండగా.. కాల్ గర్ల్స్‌  40 మంది దాకా ఉంటార’ని మౌనిక సిట్‌ ముందు వెల్లడించింది.

కాగా ఈ సెక్స్ రాకెట్‌లో మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్ల ప్రమేయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్, ఇండోర్‌ వంటి ప్రముఖ పట్టణాల్లో సెక్స్‌ రాకెట్‌ చాలా సంవత్సరాలుగా సాగుతోందని, బ్లాక్ మెయిల్‌కు గురైన రాజకీయ నాయకులలో 80 శాతం మంది బీజేపీకి చెందినవారేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు