అయ్యో ఉమేష్‌.. ఎంత పని చేశావ్‌..!

24 Aug, 2019 12:29 IST|Sakshi

భోపాల్‌: భార్య తన మాట వినకుండా పుట్టింటికి వెళ్లిందనే కోపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యకు వీడియో కాల్‌ చేసి మరి ఉరేసుకుని చనిపోయాడు. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేష్‌(35)కు ఆర్తితో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా పుట్టింటికి వెళ్తానని ఆర్తి, ఉమేషన్‌ను కోరింది. కానీ అతడు అందుకు అంగీకరించలేదు. రక్షాబంధన్‌కు వెళ్లనివ్వలేదు.. ఇప్పుడు కూడా వద్దనడంతో ఆర్తి, ఉమేష్‌తో గొడవపడింది. దాంతో ఉమేష్‌ భార్యాపిల్లలను ఆమె పుట్టింట్లో వదిలేసి తాను ఒక్కడే గురువారం సాయంత్రం ఇంటికి వచ్చేశాడు. అయితే భార్య తన మాట వినకుండా పుట్టింటికి వెళ్లిందనే ఆలోచన అతడిని స్థిమితంగా ఉండనివ్వలేదు.

దాంతో అర్థరాత్రి సమయంలో భార్యకు వాట్సాప్‌ కాల్‌ చేశాడు. ఆర్తి తన మాట లెక్క చేయకుండా పుట్టింటికి వెళ్లి తనను అవమానించిందని ఆరోపించాడు. ఇక తాను బతకడం వృథా అని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఆర్తితో చెప్పాడు. ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమేష్‌ మాటలు విన్న ఆర్తి వెంటనే తన భర్త సోదరుడు రాజేష్‌కు ఫోన్‌ చేసింది. అతడు ఉమేష్‌ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో.. కుదరలేదు. గదిలోకి వెళ్లడం ఆలస్యం కావడంతో ఉమేష్‌ చనిపోయాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్షణికావేశంలో ఉమేష్‌ తన జీవితాన్నే అంతం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు