కవలలు కిడ్నాప్‌.. నదిలో శవమై తేలి

24 Feb, 2019 14:40 IST|Sakshi

బోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అపహరణకు గురైన ఇద్దరు కవలపిల్లల ఉదంతం తీవ్ర విషాదంతో ముగిసింది. ఫిబ్రవరి 12న పిల్లలు చదువుకుంటున్న పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని అపహరించుకుపోయిన విషయం తీవ్ర కలకలం రేపి సంగతి తెలిసిందే. కవలలో కోసం తీవ్ర గాలింపు చేపట్టిన ఆ రాష్ట్ర పోలీస్‌ బృందానికి ఉత్తరప్రదేశ్‌లోని బండా ప్రాంతంలో యమున నదీ తీరంలో విగతజీవులుగా కనిపించారు. ఐదేళ్ల శ్రేయాన్షు, ప్రియాన్షు అనే కవలలు మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన పిల్లలు. చిత్రకూట్‌ సమీపంలో వారు చదువుకుంటున్న స్కూల్‌ వద్ద యూపీకి చెందిన కిడ్నాపర్లు గన్‌తో బెదిరించి వారిని కిడ్నాప్‌ చేశారు. రూ.50 లక్షలు ఇస్తే వారిని వదిలేస్తామని బెదిరించారు. డబ్బులు చెల్లించినప్పటికీ పిల్లల్ని హతమార్చి నదిలో వదిలేశారు. ఈ ఘటన యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఘటనకు సంబందించి ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆగ్రహావేశాలు.. చెలరేగిన హింస
కిడ్నాపైన కవలలు శవాలై కొట్టుకువచ్చిన విషయం తెలియగానే మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో పెద్దఎత్తున నిరసనలు పెల్లుబికాయి. వందలాది మంది జనం ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. పిల్లలు కిడ్నాపైన ప్రదేశానికి సమీపంలో ఉన్న జానకికుంద్ షాపింగ్ కాంప్లెక్స్‌ను కొల్లగొట్టారు. కాంప్లెక్స్ ఆస్తులపై విరుచుకుపడ్డారు. కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టారు. దీంతో అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌ చేసి, టియర్ గ్యాస్ను ప్రయోగించారు.  పిల్లల స్కూలుపై కొంతమంది ఆందోళనకారులు విరుచుకుపడి రాళ్లురువ్వారు.

యోగి రాజీనామా చేయాలి
ఈఘటనపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం పదవికి యోగి ఆదిత్యానాథ్‌ రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర న్యాయశాఖమంత్రి పీసీ శర్మ డిమాండ్‌ చేశారు. యూపీ పోలీస్‌ శాఖకి పిల్లల కిడ్నాప్‌ గురించి తమ ప్రభుత్వం సమాచారం అందించిన వెంటనే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పిల్లలు హత్యకు గురికావడంతో పౌరుల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం మరోసారి బయటపడింది ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. పిల్లల హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు