నిత్యానందపై కోర్టు కన్నెర్ర

29 Jan, 2018 22:07 IST|Sakshi
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద (ఫైల్ ఫొటో)

సాక్షి, చెన్నై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై సోమవారం మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం కన్నెర్ర చేసింది. అరెస్టుకు ఆదేశాలు ఇవ్వమంటారా? అని నిత్యానందను ఉద్దేశించి న్యాయమూర్తి జస్టిస్‌ మహాదేవన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో వాదనలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా నిత్యానందకు చేరవేస్తున్న ఆయన శిష్యుడు నరేంద్రన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించారు. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన మదురై మఠాన్ని చేజిక్కించుకునేందుకు నిత్యానంద తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

తానే ఆ మఠానికి 293వ ఆధీనంగా ప్రకటించుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ జగదల ప్రతాప్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మదురై ధర్మాసనంలో విచారణ జరుగుతోంది. 292వ ఆధీనం జీవించి ఉండగానే, ఎలా 293వ ఆధీనం తెరమీదకు వస్తారని, ఇందుకు వివరణ ఇవ్వాలని నిత్యానందను ఏడాది క్రితం న్యాయమూర్తి ఆదేశించారు. అయితే నిత్యానంద తరఫున ఎలాంటి వివరణ కోర్టుకు చేరలేదు. సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు రాగా తమకు మరింత సమయం కావాలని నిత్యానంద తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏడాది సమయం ఇచ్చినా చాలదా? నిత్యానందను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిలా ఆదేశాలు ఇవ్వమంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిత్యానందపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అరెస్టు చేసి కోర్టు బోనులో ఎక్కించేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేశారు. అదే సమయంలో కోర్టులో సాగుతున్న వాదనల పర్వాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా నిత్యానందకు ఎప్పటికప్పుడు ఆయన శిష్యుడు నరేంద్రన్‌ అందిస్తుండటాన్ని కోర్టు సిబ్బంది గుర్తించి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. దీంతో నరేంద్రన్‌ను అరెస్టు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
 

మరిన్ని వార్తలు