కల్లు తాగితే కన్నమేయాల్సిందే!

26 Jan, 2019 02:54 IST|Sakshi

స్థితిమంతుడైన ఓ దొంగ వ్యవహార శైలి ఇది 

భార్య మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాజీ ఎంపీపీ 

ఇప్పటికే పలుమార్లు అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌: ఆయన ఇరవై ఎకరాల రైతు. రెండు బహుళ అంతస్తుల భవనాలకు యజమాని. భార్య మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాజీ ఎంపీపీ. ఆర్థికంగా స్థితిమంతుడే. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ‘కల్లు’దగ్గరకు వచ్చేసరికి మాత్రం తేడా వస్తోంది. ఆ మత్తులో కనీసం ఒక ఇంటి తాళమైనా పగలకొట్టి కన్నం వేయాల్సిందే. అప్పుడప్పుడూ దత్తపుత్రుణ్ణి సైతం వెంటేసుకుని వెళ్లి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. అనేకసార్లు అరెస్టు అయి నా పంథా మార్చుకోని అమర్‌సింగ్‌(55) మరో సారి పోలీసులకు చిక్కాడు. చిన్నప్పటి నుంచే చోరీలు చేయడం అలవాటైన ఇతగాడు తొలినాళ్లల్లో కోళ్లను దొంగిలించేవాడు. పెద్దయ్యాక ఆస్తులు సమకూరినా, భార్యకు రాజకీయంగా పలుకుబడి పెరిగినా ‘వీక్‌నెస్‌’మాత్రం పోవట్లేదు. ఏడు చోరీలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై రాచకొండ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనే మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం బైరాపురంలోని నగరగడ్డ తండాకు చెందిన రత్లావత్‌ అమర్‌సింగ్‌.  

దత్తపుత్రుడితో కలసి... 
ఈయన భార్య విజయ బైరాపురం సర్పంచ్‌గా, వెల్దండ ఎంపీపీగా ప్రజాసేవ చేసి మంచి గుర్తింపు పొందారు. వీరికి తమ స్వగ్రామంలో 20 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. ఆమన్‌గల్, హైదరాబాద్‌లోని చంపాపేట దుర్గాభవానీనగర్‌లో బహుళ అంతస్తుల భవనాలున్నాయి. వీటి మీదే ప్రతి నెలా దాదాపు రూ.50 వేల వరకు అద్దె వస్తుంటుంది. అమర్‌సింగ్‌ సోదరుడు చనిపోవడంతో అతడి కుమారుడు రామ్‌కోటిని దత్తత తీసుకున్నాడు. ఆమన్‌గల్‌లో డిగ్రీ కూడా చదివించాడు. అమర్‌సింగ్‌ కొన్నాళ్లు సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి కాలనీలోనూ నివసించాడు. ఆయనకు కల్లు తాగే అలవాటు ఉంది. ఆ మత్తులో రెక్కీ చేయనిదే అతడి కాలు, చోరీకి పాల్పడనిదే అతడి చేయి ఆగవు. మత్తులోనే తానున్న ప్రాంతంలో ఉదయం కాలినడకన తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రిపూట మళ్లీ కల్లు తాగి వచ్చి చోరీకి అనువుగా ఉన్న ఇంటికి కన్నం వేస్తాడు. దీంతో అతడిపై హైదరాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయి.

కొన్ని సందర్భాల్లో దత్తపుత్రుడితో కలిసే రంగంలోకి దిగేవాడు. రామ్‌కోటి బయట కాపుకాయగా అమర్‌సింగ్‌ ఇంట్లోకి వెళ్లి విలువైన సామాన్లు, నగలు, డబ్బు కాజేసేవాడు. ఈ విధంగా నగరంలోని సైదాబాద్, చంపాపేట్, సరస్వతీన గర్, వినయ్‌నగర్‌ కాలనీ, ఎల్బీనగర్‌ పరిధిలోని కొన్నిచోట్ల చేతివాటం ప్రదర్శించాడు. 2012 జూలై 28న, ఆగస్టు 11న, 2013 నవంబర్‌లో నగర పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు. అయినా ఇతడి పంథాలో మార్పు రాలేదు. తాజాగా సైదాబాద్, ఎల్బీనగర్‌ పరిధుల్లో దాదాపు ఏడు చోరీలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వలపన్నారు. కల్లుతాగి చోరీలు చేయడానికి వస్తూ ఎల్బీనగర్‌ పరిధిలో చిక్కాడు. అమర్‌సింగ్‌ను వివిధ కోణాల్లో విచారిస్తున్న పోలీసులు నేరాల చిట్టా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు