విదేశీ పనిమనిషికి షార్జాలో ఉరిశిక్ష

26 Mar, 2018 20:03 IST|Sakshi

షార్జా: తొమ్మిది నెలల పసిపాపను కొట్టి, ఆ పాప చావుకు కారణమైన ఇండోనేషియా దేశానికి చెందిన మహిళకు షార్జా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. షార్జాలోని ఓ ఇంట్లో పనిమనిషిగా చేరిన మహిళ ఇంట్లో ఎవరు లేని సమయంలో తన యాజమాని తొమ్మిదినెలల పాపను తీవ్రంగా కొట్టింది. అమానుషంగా క్రికెట్‌ బ్యాట్‌తో చావాబాది, ఎత్తి నేలపై పడేసింది.

దాంతో పాప అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు పాపను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, పాప కోమాలోకి వెళ్లిందని వైద్యులు నిర్ధారించారు. పాప తల్లిదండ్రులు ఇంటి పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెకు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప రెండు వారాల అనంతరం మృతి చెందింది. షార్జా కోర్టు విచారణ జరిపి పనిమనిషిని దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది.   
 
తీర్పు అనంతరం పాప తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తీర్పు సంతృప్తినిచ్చిందని, తన బిడ్డను చంపిన ఆమెకి తగిన గతే పట్టిందన్నారు. ఎన్ని చేసిన తమ పాప తిరిగి రాదని, ఇతర చిన్నారుల కోసం, వారి భద్రత కోసం దేవుడ్ని ప్రార్ధించడం తప్ప తాము ఏం చేయగలమని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు