ఆయుధాలు లభ్యం

30 May, 2020 11:35 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలివే(ఫైల్‌)

వాటిని ఎనిమిదేళ్ల క్రితం అపహరించిన మావోలు

భద్రాద్రి కొత్తగూడెం, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు ఎనిమిదేళ్ల క్రితం పోలీసుల వద్ద నుంచి అపహరించిన ఆయుధాల్లో కొన్ని ఇటీవల లభ్యమయ్యాయి. 2013, మే 25న సుకుమా–జగదల్‌సూర్‌ మార్గంలోని 30వ నంబర్‌ జాతీయ రహదారి (గతంలో 221 నంబర్‌ జాతీయ రహదారి)లో ఉన్న జెర్రూం ఘాట్‌ రోడ్‌లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరివర్తన్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ కాన్వాయ్‌ను మావోయిస్టులు అడ్డుకున్నారు.

శక్తిమంతమైన మందుపాతరను పేల్చి 27 మందిని హతమార్చారు. మహేంద్రఖర్మతోపాటు 8 మంది పోలీస్‌ సిబ్బంది, 12 మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఇద్దరు కార్యకర్తలు, నలుగురు గ్రామస్తులు ఉన్నారు. ఈ ఘటనలో మావోయిస్టులు పోలీసు బలగాలకు చెందిన తొమ్మిది ఏకే 47 తుపాకులు, 7 ఇన్‌శాస్‌ రైఫిళ్లు, 2 ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు, 4 నైన్‌ ఎంఎం పిస్టళ్లు అపహరించుకుపోయారు. ఈ ఆయుధాలను నాటి నుంచి మావోయిస్టులు వినియోగిస్తూనే ఉన్నారు. ఇటీవల రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని మన్పూర్‌కు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్దోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో పోలీసులు నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఏకే 47 కూడా ఉంది. ఆ ఆయుధాలన్నీ మహేంద్రఖర్మ హత్య జరిగిన రోజు మావోయిస్టులు అపహరించినవేనని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు.

మరిన్ని వార్తలు