సైలెన్సర్‌ లేకుండా బైకు నడిపాడని..

12 Jul, 2019 11:14 IST|Sakshi

చండీగఢ్‌ : సైలెన్సర్‌ లేని బైకు నడిపిన కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి పంజాబ్‌లోని ఖానౌరీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌ ఖానౌరీకి చెందిన గురుతేజ్‌ అనే యువకుడు స్నేహితులతో కలిసి రాత్రివేళ బైక్‌ రైడ్‌కు వెళ్లాడు. బైకుల సైలెన్సర్లు తీసేసి రోడ్లపై చెక్కర్లు కొట్టడం ప్రారంభించారు. తార్‌సెమ్‌ వీధిలోకి రాగానే తొమ్మిది మంది వ్యక్తులు వారిని అడ్డగించారు. ఇంకోసారి సైలెన్సర్‌ లేని బైకులు నడపకుండా బుద్ధిచెబుతామంటూ గురుతేజ్‌తో పాటు అతడి స్నేహితులపై మూకుమ్మడిగా పదునైన వస్తువులతో దాడికి పాల్పడ్డారు.

ఈ సమయంలో రవి అనే వ్యక్తి గురుతేజ్‌ మెడపై కత్తితో దాడి చేశాడు. అనంతరం దాడికి పాల్పడ్డ తొమ్మిది మంది అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ గురుతేజ్‌ను పటియాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గురుతేజ్‌ తండ్రి హకమ్‌ సింగ్‌ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ  లక్కు సింగ్‌, సుఖ్‌చైన్‌ సింగ్‌, రవి, సందీప్‌, దీపు, లడ్డీ, మిథా, డీసీ, పకోరీల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు