ఆడుతూ.. ఆడించేశాడు!

26 Jul, 2018 08:50 IST|Sakshi

పేకాట డెన్‌ ఏర్పాటు చేసిన వ్యాపారి

స్నేహితులను ఆహ్వానించి డబ్బు వసూలు

సాక్షి, సిటీబ్యూరో: పేకాటకు బానిసగా మారిన ఓ పాల వ్యాపారి ఆర్థికంగా నష్టపోయాడు. ఈ అప్పులు తీర్చుకునేందుకు తానే ఓ పేకాట శిబిరం ఏర్పాటు చేశాడు. పరిచయస్తులు, స్నేహితులను ఆహ్వానించి మూడుముక్కలాట ఆడిస్తూ డబ్బు వసూలు చేయడం మొదలెట్టాడు. ఈ వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం దాడి చేశారు. నిర్వాహకుడి సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు.

వివరాల్లోకి వెళితే..సీతాఫల్‌మండిలోని బీడ్లబస్తీకి చెందిన సతీష్‌కుమార్‌ వృత్తిరీత్యా పాల వ్యాపారి. పేకాటకు బానిసగా మారిన ఇతను ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలయ్యాడు. వీటి నుంచి బయటపడటంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం తానే ఓ పేకాట శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో  భాగంగా చిలకలగూడ ఎస్బీహెచ్‌ కాలనీలోని తన బంధువు ఇంట్లో ఓ పోర్షన్‌ అద్దెకు తీసుకున్నాడు. తన ‘సహచర పేకాటరాయుళ్ల’తో పాటు ఆసక్తి ఉన్న వారినీ ఇక్కడకు ఆహ్వానిస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ.800 చొప్పున వసూలు చేస్తూ మూడు ముక్కలాట ఆడిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం బుధవారం దాడి చేసింది. సతీష్‌తో పాటు ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసి రూ.25 వేల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. 

హుక్కా సెంటర్లపై దాడి...  
వెస్ట్‌జోన్‌ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న రెండు హుక్కా పార్లర్లపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసు లు బుధవారం దాడులు చేశారు. మొత్తం ముగు ్గరు నిందితులను అరెస్టు చేసి హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. బంజారాహిల్స్‌ లో కేఫ్‌ 4 రస్తా కాఫీ షాప్‌ పేరుతో హుక్కా సెంటర్‌పై దాడి చేసి యజమాని సీహెచ్‌ సత్యతేజ, మేనేజర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌లను, జూబ్లీహిల్స్‌లోని ఏరియా 1070 కాఫీ షాప్‌ పేరుతో ఉన్న హుక్కా కేంద్రంపై దాడి చేసి మేనేజర్‌ షేక్‌ అల్తాఫ్‌లను అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు