మాయమాటలతో రూ.లక్షలు కాజేశాడు

11 Feb, 2020 08:54 IST|Sakshi
నిందితుడు సందీప్‌కుమార్‌

 సినీ పరిశ్రమలోపెట్టుబడుల పేరిట మోసం

పరారీలో ఉన్న నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు

అమీర్‌పేట: సినీ పరిశ్రమలో డబ్బులు పెడితే అతి తక్కువ సమయంలో లక్షల రూపాయలు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి మోసం చేసిన ఓ వ్యక్తిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ వివరాల ప్రకారం.. రాంనగర్‌కు చెందిన బీరెల్లి సందీప్‌కుమార్‌ వెంగళరావునగర్‌లోని జీడీపీ హాస్టల్‌లో ఉంటున్న కారు డ్రైవర్‌ మంద ప్రవీణ్‌కుమార్‌కు ఆరు నెలల క్రితం పరిచయమయ్యాడు. సందీప్‌ వద్ద తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేసిన ప్రవీణ్‌కు తనకు తాను సినీ డిస్ట్రిబ్యూటర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనకు రూ.15 లక్షలు ఇవ్వాలని తిరిగి 15 రోజుల్లో ఇస్తానని అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు ప్రవీణ్‌కుమార్‌ సోదరికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. 

అంతేకాకుండా సినిమాల్లో వాడిన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తారని, మీకైతే తక్కువకు  ఇప్పిస్తానని గత ఏడాది జులై 5న మరో రూ.5 లక్షలు దండుకున్నాడు. బంగారం ఇవ్వకపోగా అప్పుగా తీసుకున్న రూ.15 లక్షలు తిరిగి ఇవ్వాలని ప్రవీణ్‌ ఒత్తిడి చేశాడు. దీంతో డబ్బుల ప్రస్తావన తెస్తే ప్రవీణ్‌తో పాటు సౌమ్య అనే మహిళను చంపేస్తానని సందీప్‌కుమార్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు ప్రవీణ్‌ గత ఏడాది ఆగస్ట్‌ 5న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సందీప్‌కుమార్‌తో పాటు అతడికి సహకరించిన సురేష్‌ అనే వ్యక్తిని రాంనగర్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యాంకర్‌ రవి వద్ద కూడా రూ.45 లక్షలు అప్పుగా తీసుకున్న సందీప్‌ డబ్బులు చెల్లించకుడా గతంలో బెదిరింపులకు పాల్పడ్డాడు. సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులతో పరిచయముందని, వారికి డబ్బులు అప్పు ఇస్తే అధిక వడ్డీ వస్తుందని చెప్పి పలువురిని నమ్మించి  సుమారు రూ.3 కోట్ల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు