నిత్య పెళ్లి కొడుకు

22 May, 2018 12:41 IST|Sakshi

పెళ్లి కాలేదని మూడో  పెళ్లి చేసుకుని మోసం

భార్యను వేధించి నాలుగో పెళ్లికి సిద్ధమైన ఘనుడు

భర్త ఇంటి ముందు తల్లిదండ్రులతో కలిసి భార్య ధర్నా

నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి మూడో పెళ్లి చేసుకుని తనను ముంచేశాడని భార్య కన్నీరు పెట్టింది. నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలుసుకుని భర్త ఇంటి ముందు ఆమె తల్లిండ్రులతో కలిసి  సోమవారం ధర్నాకు దిగింది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాళేనికి చెందిన పుచ్చలపల్లి గంగిరెడ్డి, జయమ్మ దంపతుల ఏకైక కుమార్తె రాధను బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన కమతం శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసమ్మ ఏకైక కుమారుడు కమతం వెంకట ప్రసాద్‌రెడ్డికి ఇచ్చి 2016 డిసెంబరు 4న తిరుమలలో వివాహం చేశారు. వరకట్నం కింద రూ.11 లక్షల నగదు, 15 సవర్ల బంగారం ఇచ్చారు. అయితే వివాహానికి ముందు నెల్లూరులో ఉన్నామని చెప్పిన ప్రసాద్‌రెడ్డి వివాహమైన తర్వాత బుచ్చిరెడ్డిపాళేనికి తీసుకు వచ్చాడు.

సొంత ఇళ్లు, పొలాలు ఉండటంతో ఇక్కడే ఉందామని నమ్మబలికాడు. పది రోజుల తర్వాత నుంచి రాధ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని తన పేరిట రాయమని రాధను మామ శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశాడు. వాళ్లకు వేరే ఆధారం లేదని రాధ చెప్పడంతో భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. మామ శ్రీనివాసులురెడ్డి కోడలు రాధను శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. అత్త శ్రీనివాసమ్మ రాధ జడ కత్తిరించడం, వాతలు పెట్టడం మొదలు పెట్టింది. రాత్రి నిద్రపోయే సమయంలో శ్రీనివాసులురెడ్డి కోడలు రాధ పక్కన పడుకునేవాడు. ఈ విషయం భర్త ప్రసాద్‌రెడ్డికి చెప్పినా సర్దుకుపోమని చెప్పేవాడు. ఈ క్రమంలో 2017 ఏప్రిల్‌లో నెల్లూరుకు ద్విచక్ర వాహనంలో తీసుకెళుతూ పడేశాడు. దీంతో నువ్వు మీ పుట్టింటికి వెళ్లి కొంతకాలం ఉండమని చెప్పాడు. అప్పటికే చిత్రహింసలు భరించలేక ఇబ్బంది పడుతున్న రాధ అత్తింట్లో ఉండలేక రెండు నెలలు పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రసాద్‌రెడ్డి అత్తమామలకు ఫోన్‌చేసి మీ అమ్మాయిని మీ వద్దే ఉంచుకోండి అంటూ చెప్పాడు.

విచారిస్తే వెలుగులోకి వచ్చింది
ప్రసాద్‌రెడ్డి ఫోన్‌ సంభాషణతో కంగారు పడిన రాధ తల్లిదండ్రులు బుచ్చిరెడ్డిపాళేనికి రాగా ఇంట్లోకి రానివ్వలేదు. తలుపులకు తాళం వేశారు. లోపల ఉండి కూడా ఎవరూ లేరని ప్రసాద్‌రెడ్డి తల్లి శ్రీనివాసమ్మ చెప్పేది. దీంతో ప్రసాద్‌రెడ్డి కుటుంబీకులు, స్థానికులను విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసాద్‌రెడ్డికి 2013లో సుప్రియ అనే యువతితో వివాహమైంది. 2015లో కాగులపాడుకు చెందిన నిరోషా అనే యువతితో వివాహం జరుగుతుండగా ప్రసాద్‌రెడ్డికి ముందే జరిగిన పెళ్లి విషయం తెలిసి మండపంలోనే వివాహాన్ని ఆపేశారు. ఆ తర్వాత 2016 డిసెంబరు 4వ తేదీన రాధను వివాహం చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడని రాధ వాపోయింది.

పోలీసుల అదుపులో భర్త
రాధ తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ప్రసాద్‌రెడ్డి ఇంటి ముందు సోమవారం ధర్నాకు దిగింది. దీంతో మామ శ్రీనివాసులురెడ్డి తమపై కొందరు దాడి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇంటి వద్దకు రాగా, జరిగిన విషయం తెలిసి పోలీసులు ప్రసాద్‌రెడ్డిని బయటకు పిలిచారు. అయితే అతను ఇంట్లో తలుపు వేసుకుని బయటకు రాలేదు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.

పోలీసులకు ఫిర్యాదు
గతంలో బుచ్చిరెడ్డిపాళెంలో పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాధ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ వద్దకు వెళ్లడంతో తన సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పింది. 2017 జూన్‌లో విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇప్పుడు చార్జిషీట్‌ సిద్ధం చేస్తుండటంతో ఎక్కడ మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సి వస్తుందోనని ఆస్తి మొత్తం ప్రసాద్‌రెడ్డి తన తల్లి శ్రీనివాసమ్మ పేరిట రిజిస్టర్‌ చేశారని తెలిపింది. అత్త మామలతో కాకుండా వేరో చోట తాను కాపురం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకు న్యాయం చేయాలని రాధ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై సీఐ టీవీ సుబ్బారావును సంప్రదించగా రాధ ఎస్పీని కలిసిన విషయం వాస్తవమేనన్నారు. ఫిర్యాదు తనకు అందగా పరిశీలించానన్నారు. ఇది వరకే దీనిపై విజయవాడలో కేసు నమోదైందని, కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు