అశ్లీల వీడియోల షేరింగ్‌

13 Dec, 2019 10:56 IST|Sakshi

తిరుచ్చిలో వ్యక్తి అరెస్టు  

సాక్షి, చెన్నై: పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌ మెసెంజర్‌ గ్రూప్‌ పేరిట వందలాది మందికి షేరింగ్‌ చేస్తూ వచ్చిన తిరుచ్చికి చెందిన వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో దిశా ఘటన తరువాత తమిళ పోలీసులు మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ అశ్లీల వీడియోలను వీక్షించే వారిని, వాటిని డౌన్‌లోడ్‌ చేసే వారు, షేరింగ్‌ చేసే వాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెడుతామన్న హెచ్చరికలు సైతం జారీ చేశారు. పదే పదే తమకు పట్టుబడితే ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని ప్రకటించి ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్‌ అల్ఫోన్స్‌ రాజా(40) తొలుత ఆదవన్‌....ఆదవన్‌ పేరిట ఓ మెసెంజర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని అశ్లీల వీడియోలను వందలాది మందికి షేరింగ్‌ చేస్తూ వస్తుండడాన్ని సైబర్‌క్రైం వర్గాలు పసిగట్టాయి. అదే సమయంలో రాజాపేట న్యూవీధికి చెందిన ముత్తు పాండి సైతం అల్ఫోన్స్‌ రాజాపై ఫిర్యాదు చేశాడు. అత్యధికంగా పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్‌లో తనకు వస్తున్నట్టుగా ముత్తు పాండి ఫిర్యాదు చేయడంతో సైబ్రర్‌ క్రైం వర్గాలు రంగంలోకి దిగాయి. ఐపీ అడ్రస్సు ఆధారంగా అల్ఫోన్స్‌ రాజా ఫోన్‌ నంబర్, అడ్రస్సును కనిపెట్టారు. గురువారం వేకువజామున అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు పూర్తి వివరాల్ని సేకరించే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు