బ్లాక్‌మెయిలర్‌ అరెస్టు

16 Jul, 2020 13:14 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విశాల్‌ గున్నీ, డీఎస్పీ శ్రీనివాసరావు, వెనుక నిందితుడు

గుంటూరు ఈస్ట్‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుడు పనులకు ఉపయోగించిన ఓ ప్రబుద్ధుడిని  పోలీసులు కటకటాల వెనుకకు పంపించారు. ఫేక్‌ వాట్సప్‌ , ఫేక్‌ ఇన్‌స్ట్రాగామ్‌ సృష్టించి తనతో చదువుకున్న పూర్వ విద్యార్థులను, పరిచయం ఉన్న యువతుల నగ్న చిత్రాలు సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిని గుంటూరు రూరల్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్పీ విశాల్‌ గున్నీ  జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో వివరాలు వెల్లడించారు. నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన కామరాజుగడ్డ రఘుబాబు కేరళలోని కొచ్చిలో యానిమేషన్‌ మల్టీ మీడియాలో బీఎస్సీ పూర్తి చేశాడు. గుంటూరులో కొంతకాలం సొంతంగా ఐటీ కంపెనీ నిర్వహించాడు. లాక్‌డౌన్‌ సమయంలో తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. రెండు నెలల క్రితం మొబైల్‌ ఫోన్‌ ద్వారా numero Sim యాప్‌ ద్వారా ఒక నెల వ్యాలిడిటీ గల ఫేక్‌ వర్చువల్‌ నంబర్లు తీసుకుని వాటితో ఫేక్‌ వాట్సప్‌ సృష్టించాడు. PIC AQTయాప్‌ ద్వారా తనతో పాటు 9వ తరగతి వరకు చదువుకున్న యువతుల ఫొటోలను  నగ్నఫొటోలుగా  మార్ఫింగ్‌ చేసి పంపాడు.

తిరిగి ఆ యువతుల అసలైన నగ్నఫొటోలను తనకు పంపాలని..లేకపోతే తన వద్ద ఉన్న నగ్నఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని, మిత్రులకు పంపుతానని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. కొంతమంది  ఆ ఫేక్‌ నంబర్‌ను దైర్యం చేసి బ్లాక్‌ చేయగా ఓ యువతి భయపడి అతను చెప్పినట్లు చేసింది. దీంతో మరింత బరితెగించిన రఘుబాబు   numero Sim యాప్‌ ద్వారా మరొక ఫేక్‌ నంబర్‌ తీసుకుని దానితో ఫేక్‌ వాట్సప్, ఫేక్‌ ఇన్‌స్ట్రాగామ్‌ సృష్టించాడు. చిన్ననాటి సహ విద్యార్థినీల ఫొటోలను నగ్నఫొటోలుగా మార్ఫింగ్‌ చేశాడు. మొదటి యువతులను బ్లాక్‌ మెయిల్‌ చేసిన విధంగానే వీరిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు.  దీంతో గుంటూరు నగరంపాలెం పరిధిలో నివశించే యువతి ధైర్యం చేసి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు  యువతి తనకు లొంగిపోయిందనే ధైర్యంతో తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా 
10MINUTEMAIL.COM అనే వైబ్‌సైట్‌ ద్వారా రెండు డిస్పోజబుల్‌ మెయిల్స్‌ తీసుకుని వాటి ద్వారా రెండు ఫేక్‌ ఇన్‌స్ట్రాగామ్‌లను సృష్టించి యథాతదంగా ఆ యువతిని  బ్లాక్‌మెయిల్‌ చేశాడు. మొత్తం 10 మంది విద్యార్థినీలను ఇలా బెదిరించినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఫేక్‌ అకౌంట్లను ఛేదించారు. నిందితుడి ఫోన్‌ నంబర్, అడ్రస్‌ గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో బాపట్ల డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రేపల్లె రూరల్‌ సీఐ జి.శ్రీనివాసరావు, నగరం ఎస్‌ఐ ఎం.వాసు, సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.  

మరిన్ని వార్తలు