పెళ్లికి నిరాకరించిందనే...

7 Aug, 2018 09:11 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ గోనె సందీప్‌రావు

మహిళపై కిరోసిన్‌ పోసి హత్య..

నిందితుడు రాకేష్‌ రాయ్‌ రిమాండ్‌

బోడుప్పల్‌: పెళ్లికి నిరాకరించిందని ఓ మహిళపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన కేసులో నిందితుడిని మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, గోరఖ్‌పూర్‌ జిల్లాకు చెందిన రాకేష్‌రాయ్‌ పెయింటర్‌గా పని చేసేవాడు. గత ఆరేళ్లుగా బోడుప్పల్‌ దేవేందర్‌నగర్‌లో కాలనీలో ఉంటూ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సమీపంలోని సీతారాం కాలనీకి చెందిన  షేక్‌ మహమ్మద్‌ కుమార్తె సయ్యద్‌ షన్ను భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటోంది. రాకేష్‌రాయ్‌తో కలిసి పని చేస్తున్న షన్నుకు అతడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

గత కొంత కాలంగా తనను పెళ్లి చేసుకోవాలని రాకేష్‌ షన్నుపై ఒత్తిడి చేస్తుండగా తనకు పిల్లలు ఉన్నందున పెళ్లి చేసుకోవడం కుదరని చెప్పింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. గత నెల 28న పెళ్లి విషయంపై మరో సారి గొడవ జరగగా పెళ్లికి నిరాకరించదన్న కోపంలో రాకేష్‌రాయ్‌ షన్నుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది.  షన్ను కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం పరారైన రాకేష్‌ను మేడిపల్లి ఎస్సై శ్రీనివాస్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం గోరఖ్‌పూర్‌లో అదుపులోకి తీసుకుంది. విచారణలో షన్నుతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించదనే కోపంతోనే ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు తెలిపాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి, ఎస్సై రఘురాం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు