డబ్బులిస్తే..డబుల్‌

21 Sep, 2018 07:35 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు నిందితుడు మురళీకృష్ణ

ప్రజలకు టోకరా రూ. 50 లక్షలకు పైగా వసూలు

విజయనగర్‌కాలని: సంవత్సరంలో మీ డబ్బులు రెట్టింపు చేసి ఇస్తానంటూ ప్రజలను నమ్మించి రూ. 50 లక్షలకు పైగా వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని గురువారం ఆసీఫ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆసీఫ్‌నగర్‌ ఏసీపీ  కార్యాలయంలో ఏసీపీ అశోకచక్రవర్తి  వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా, ఈపురుపాలెం పద్మనాభుని పేటకు చెందిన కొండ వెంకటమురళీ కృష్ణ వివిధ వ్యాపారాలు చేసేవాడు. ఐదు నెలల క్రితం మెహిదీపట్నం బోజగుట్టలో పాగా వేసిన అతను తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఏడాదిలో  రెట్టింపు చేసి ఇస్తానని ప్రచారం చేసుకున్నాడు. పెట్టుబడులు పెట్టిన వారికి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇతర బహుమతులు వారికి ఇచ్చి వారి నమ్మకాన్ని చూరగొన్నాడు.

అతని మాటలు నమ్మిన కొందరు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టగా 15 రోజుల్లో రెట్టింపు మొత్తాలు ఇచ్చాడు. దీంతో బోజగుట్ట, జాందార్‌నగర్, అంబేద్కర్‌నగర్, శ్రీరాంనగర్, శివాజీనగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్పులు చేసి మరీ రూ. 50 లక్షలకు పైగా అతడికి ముట్టజెప్పారు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో జాందార్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ యూసూఫ్‌ ఈనెల 18న ఆసీఫ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళ, బుధవారాల్లో బోజగుట్టకు వస్తాడని సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను మకాం వేసిన సికింద్రాబాద్‌ స్వాతి లాడ్జిలో సోదాలు చేసి రూ. 12,33,400 నగదు, 6 బంగారు గొలుసులు, రెండు బ్రాస్‌లెట్‌లు, 9 ఉంగరాలతో పాటు 3 వెండి పట్టా గొలుసులు, 3 వెండి గొలుసులు, ఒక వెండి బ్రాస్‌లెట్, 4 ఉంగరాలు, 7 కప్పులు, ఒక స్పూన్, రెండు వెండి బిస్కెట్‌లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో  ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌.ఐ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు