పేరుకు భూత వైద్యం.. చేసేది మోసం..

9 Feb, 2020 12:52 IST|Sakshi
క్వారీలో పూజలు చేస్తున్న భూతవైద్యుడు పోతురాజు

దెయ్యం పేరుతో మోసగిస్తున్న భూతవైద్యుడు

అమాయకుల నుంచి వేలాదిరూపాయల స్వాహా...

స్థానికుల వ్యూహంతో పోలీసులకు పట్టుబడిన వైనం

సాక్షి, శృంగవరపుకోట: దెయ్యాలు... భూతాలు... చెడుపు... చిల్లంగి... చేతబడులు... బాణామతులు అంటూ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను సొమ్ము చేసుకుంటున్న ఓ భూతవైద్యుడి బండారం బయటపెట్టిన సంఘటన ఇది. శృంగవరపుకోటలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మూలబొడ్డవర పంచాయతీ పరిధి గాదెల్లోవ గ్రామంలో గమ్మెల పోతురాజు అనే వ్యక్తి భూతవైద్యం పేరుతో సామాన్యులను మోసం చేసి డబ్బులు గుంజుతున్నాడు. ఇటీవల ఇతని భూతవైద్యాన్ని నమ్మి కొడుకును పోగొట్టుకున్న కుటుంబీకుల వేదన చూసి చలించిపోయిన శృంగవరపుకోట బర్మాకాలనీకి చెందిన జనా లక్ష్మీనారాయణ మారుమూల గ్రామంలో భూతవైద్యుడు పోతురాజు చేస్తున్న మోసాన్ని కొంతమంది మీడియా మిత్రులకు చెప్పారు.

భూతవైద్యుడి ఆటకట్టించాలని పథక రచన చేశారు. బర్మా కాలనీకి చెందిన పొడుగు అప్పలరాజు అనే వ్యక్తికి ఆరోగ్యం బాగా లేదని పోతురాజు వద్దకు తీసుకెళ్లారు. అతనికి దెయ్యం పట్టిందని బాగుచేయాలని, అందుకు పూజ జరిపించాలని పోతురాజు చెప్పాడు. పూజలు చేసేందుకు బయటి వారికైతే రూ. 40వేలు తీసుకుంటానని చెప్పాడు. లక్ష్మీనారాయణ తదితరులు బాధితుడు అప్పలరాజుకు బాగు చేసేందుకు పూజ పెట్టాలని కోరారు. అందుకు రూ.10వేలు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అతడిని ఎస్‌.కోట రావాలంటూ పిలిచారు. శనివారం సాయంత్రం ఎస్‌.కోట వచ్చిన పోతురాజు 6గంటల సమయంలో బర్మా కాలనీ సమీపంలోఉన్న క్వారీలో అప్పలరాజును కూర్చోబెట్టి రంగులతో ముగ్గులు వేసి, హోమాలు వేసి పూజలు చేసినట్టు నమ్మించాడు.

పూజలు చేస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ తదితరులు కొందరు విలేకరుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్‌.కోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భూతవైద్యుడు పోతురాజును స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ శ్రీనివాసరావు పోతురాజును విచారించగా తాను డబ్బు కోసం పూజలు చేయనని, ఎవరైనా గాలి గుణంతో ఇబ్బంది పడితే బాగు చేసి, వాళ్లిచ్చిందే తీసుకుంటానంటూ చెప్పాడు. లక్ష్మీనారాయణ, అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌.కోట పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు