పెళ్లి అప్పులు తీర్చేందుకు చోరీల బాట

20 Feb, 2019 09:30 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ గాంధీనారాయణ

నిందితుడి అరెస్ట్‌ రూ.1.70 లక్షల విలువైన

ఆభరణాలు స్వాధీనం

మీర్‌పేట: కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులను తీర్చేందుకు ఓ తండ్రి దొంగగా మారిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, బిజినేపల్లికి చెందిన వంగూరు శ్రీనివాసచారి కార్పెంటర్‌గా పని చేసేవాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చిన అతను కుటుంబంతో సహా కర్మన్‌ఘాట్‌ శక్తినగర్‌లో ఉంటున్నాడు.

ఆరేళ్ల క్రితం అతను కుమార్తె వివాహం నిమిత్తం అప్పులు చేశాడు. వృత్తిలో ఆదాయం లేకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేశించాడు. రాత్రి వేళల్లో ఫంక్షన్‌హాళ్ల వద్ద చిన్నారులకు మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించేవాడు. ఈ తరహాలో కర్మన్‌ఘాట్‌లోని వంగ శంకరమ్మ గార్డెన్స్, స్వాగత్‌గ్రాండ్‌ ఫంక్షన్‌హాళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో నిందితుడు శ్రీనివాసచారిని అరెస్ట్‌ చేసి అతడి నుంచి రూ.1.70 లక్షల విలువైన 5.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు