హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

21 Dec, 2019 13:04 IST|Sakshi
అరెస్టుకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ స్నేహిత

జంగారెడ్డిగూడెం: ఈ నెల 18న స్థానిక బస్టాండ్‌ వద్ద ఒక మహిళను హత్యచేసిన నేరంపై ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.స్నేహిత తెలిపారు. స్థానిక పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించారు. బేతపూడి హేమలత(29) అనే మహిళను కొవ్వూరు మండలం పి.సావరం గ్రామానికి చెందిన గంటా ప్రవీణ్‌కుమార్‌ పీక నులిమి హత్యచేసినట్లు తెలిపారు. మండలంలోని నిమ్మలగూడేనికి చెందిన హేమలతకు 2012లో చాగల్లులో పనిచేస్తుండగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైనట్లు చెప్పారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారన్నారు. అయితే 2014లో హేమలతకు తెలియకుండా ప్రవీణ్‌కుమార్‌ కొవ్వూరుకు చెందిన వేరొక మహిళను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే హేమలతకు కూడా ఏడాది క్రితం గౌరీపట్నం మేరీ మాత గుడిలో తాళికట్టినట్లు వెల్లడించారు.

అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్నారు. తరువాత కొన్ని రోజులకు ప్రవీణ్‌కుమార్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు హేమలతకు తెలిసిందన్నారు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పారు. నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని హేమలత నివాసం ఉంటున్నట్లు తెలిపారు. స్థానికంగా ఒక ఫొటో స్టూడియోలో పనిచేస్తోందన్నారు. అయితే ప్రవీణ్‌కుమార్‌ అప్పుడప్పుడూ హేమలత వద్దకు వచ్చి వెళుతుండేవాడని, ఏ పనీ లేక, ఆదాయం లేక హేమలతను డబ్బులు అడుగుతుండేవాడన్నారు. దీంతో హేమలత ఎంతో కొంత డబ్బులు ఇస్తుండేదని డీఎస్పీ చెప్పారు. అయితే ఘటనకు ముందు వారం రోజులుగా ప్రవీణ్‌కుమార్‌ జంగారెడ్డిగూడెం వచ్చి ఆమె వద్ద ఉంటున్నాడని, ఆమెను డబ్బులు అడగ్గా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు చెప్పారు. ఈనేపథ్యంలో హేమలతను ప్రవీణ్‌కుమార్‌ కొట్టి గొంతునులిమి హత్యచేసినట్లు వెల్లడించారు. అయితే ఆమె బాత్రూమ్‌కు వెళ్లి పడిపోయి మృతిచెందినట్లు అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడన్నారు. నిందితుడిపై హత్యకేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన బీఎన్‌ నాయక్, ఎస్సై ఎ.దుర్గారావు, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, హెచ్‌సీ ఎన్‌.రాజేంద్ర, పీసీలు కె.కిరణ్, బి.హరిప్రసాద్‌లను డీఎస్పీ అభినందించి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు