కసితోనే భార్య తల నరికాడు

17 Aug, 2019 08:55 IST|Sakshi

నిందితుడు, రెక్కీకి సహకరించిన కారు డ్రైవర్‌ అరెస్ట్‌

తల కోసం అన్వేషిస్తున్న పోలీసు బృందాలు 

సీసీ టీవీ ఫుటేజీ, ప్రత్యేక్ష సాక్షుల వాగ్మూలంతో కేసు నమోదు

సాంకేతిక ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా చార్జీషీటు దాఖలు

మీడియా సమావేశంలో హత్య వివరాలను వెల్లడించిన డీసీపీ విజయరావు

సాక్షి, అమరావతి: అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో తలెత్తిన విభేదాలు, మనస్పర్థల కారణంగానే భార్య మణిక్రాంతిని కసితోనే కడతేర్చాడని విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీ–2 విజయరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన శ్రీనగర్‌కాలనీ 4వ లైనులో భర్త చేతిలో మణిక్రాంతి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్‌కుమార్‌ను, అతడికి సహకరించిన కారు డ్రైవర్‌ భవానీ ప్రసాద్‌ను శుక్రవారం సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు.

విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ విజయరావు

ఈ సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ విజయరావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘విజయవాడలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న మణిక్రాంతి, ప్రదీప్‌కుమార్‌ 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వీరి కాపురం బాగానే ఉంది. 2017లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రదీప్‌ అతడి కుటుంబ సభ్యులపై మణిక్రాంతి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో 2018లో ఫిర్యాదు చేయగా 498(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత వివిధ సందర్భాల్లో అదే పోలీసు స్టేషన్‌లో మరో మూడు సార్లు మణిక్రాంతి ఫిర్యాదు చేయగా ప్రదీప్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో మూడు కేసులు.. మాచవరం పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టింది. సదరు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్టు చేశారు. మణిక్రాంతి పెట్టిన కేసులలో ప్రదీప్‌కుమార్, అతడి కుటుంబ సభ్యులు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఇటీవల సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న వారెంట్‌ ఆధారంగా ఈ నెల 6వ తేదీ అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా 7వ తేదీ ప్రదీప్‌ బెయిల్‌పై బయటకొచ్చాడు. 

నీవెంతంటే.. నీవెంత.. 
ఈ నెల 7వ తేదీన విజయవాడలోని కోర్టు ఆవరణలో భార్యభర్తల మధ్య కోర్టు ఆవరణలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. నీవెంత అంటే నీవెంత అనే స్థాయిలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అతడి స్నేహితుడు మధురానగర్‌ 7వ లైనుకు చెందిన గరికపాటి భవానీప్రసాద్‌ సహకారం తీసుకున్నాడు. హత్య జరిగిన ముందు(10.8.19) రోజు శ్రీనగర్‌ కాలనీకి భవానీప్రసాద్‌కు చెందిన కారులో వెళ్లి రెక్కీ నిర్వహించారు. 11వ తేదీ మధ్యాహ్నం మళ్లీ భవానీప్రసాద్‌ తన కారులో ప్రదీప్‌ను శ్రీనగర్‌ కాలనీకి తీసుకొచ్చి మణిక్రాంతి ఇంటి ముందు అతడిని దించి తాను వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ప్రదీప్‌ కుమార్‌ తన పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో మణిక్రాంతి వద్దకు వెళ్లి ఆమెను కాళ్లపైనా, మెడపైన విచక్షణా రహితంగా నరుకుతుండగా ఆమె కేకలు వేసింది. అది విని మృతురాలి తల్లి, చెల్లి బయటకు వచ్చి చూడగా వారిని బెదిరించాడు. తలను వేరు చేసి చేతిలో పట్టుకుని వెళ్తుండగా అడ్డువచ్చిన ఆమె తల్లి, చెల్లితోపాటు స్థానికులను ప్రదీప్‌ కత్తితో బెదిరించి పారిపోతూ సమీపంలోని ఏలూరు కాలువలో తలను, కత్తిని, ఫోన్‌ను పడేశాడు. ఈ నేపథ్యంలో డెయిల్‌ 100కు వచ్చిన సమాచారం మేరకు సత్యనారాయణపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కారు, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. 

సాంకేతిక ఆధారాలతో.. 
నిందితుడు మృతురాలి తలను వేరు చేసి కాలువలో పడేశాడు. ఆ తల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నాం. కాలువ మార్గంలో ఉన్న పోలీసుస్టేషన్లకు సమాచారం అందించాం. స్థానిక పోలీసులు వెతుకుతున్నారు. అయితే తల కనబడకపోయినా.. కేసుకు సంబంధించి బలమైన సాంతికేక ఆధారాలైన సీసీ టీవీ ఫుటేజీ సేకరించాం. హతుడు ఉపయోగించిన కత్తికి సంబంధించిన పిడికిలి లభ్యమైంది. రక్త నమానాలు తీసుకున్నాం. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కారును సీజ్‌ చేశాం. వీటన్నింటీ ఆధారంగానే చార్జీషీటు దాఖలు చేసి నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం’ అని విజయరావు వివరించారు. సమావేశంలో ఏడీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, ఏసీపీ షేక్‌ షరీఫుద్దీన్, సీఐ బాలమురళీ కృష్ణ, ఎస్‌ఐ సత్యానారాయణ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు