ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!

27 Aug, 2019 08:48 IST|Sakshi

ఏకాంతంలో దిగిన ఫొటోలను మరో స్నేహితుడికి షేర్‌ చేసిన వైనం

ఆ ఫొటోలతో యువతిపై బెదిరింపులకు పాల్పడిన స్నేహితుడు

మూడేళ్లుగా వేధింపులు.. రూ. 3 లక్షలకు పైగా వసూలు

నిందితుడిని రక్షించేందుకు ఓ టీడీపీ ఎంపీ విఫలయత్నం!

మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు.. నిందితుడి అరెస్టు

సాక్షి, అమరావతి: ఓ యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడి.. ఆ తర్వాత తరచూ వేధింపులకు ఒడిగడుతున్న ఓ యువకుడిని విజయవాడ నగర పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మూడేళ్లుగా బెదిరింపుల పర్వం కొనసాగుతుండగా యువతి గత శుక్రవారం ఉదయం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు విజయవాడ పోలీసు కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. తద్వారా మాచవరం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అదే రోజు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విషయాలేమీ తెలియని ఆ యువకుడి తల్లిదండ్రులు సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో తమ కుమారుడు కనిపించలేదని ఫిర్యాదు చేయడం గమనార్హం. సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..  

ప్రేమ పేరుతో నయవంచన.. 
విజయవాడలో మాచవరం ప్రాంతంలో ఉన్న రితేశ్‌(పేరు మార్చాం)కు ఉమ్మడి స్నేహితుల ద్వారా ఓ పుట్టిన రోజు వేడుకలో ఒక యువతితో 2017లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి ఆ యువకుడిని నమ్మడంతో.. ఇద్దరూ హద్దులు దాటారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు,  చిత్రాలు తీసుకున్నారు. తర్వాత రితేశ్‌ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. రితేష్‌ గతంలో తాము తీసుకున్న చిత్రాలను తన స్నేహితుడు భార్గవ్‌(పేరు మార్చాం)కు ఫోన్‌లో షేర్‌ చేసి.. నయ వంచనకు పాల్పడ్డాడు. 

స్నేహితుడి బెదిరింపులు.. 
ఆస్ట్రేలియాలో ఉన్న రితేష్‌ స్నేహితుడు భార్గవ్‌ కూడా యువతికి ఫ్రెండ్‌ కావడంతో ఓ రోజు యువతికి భార్గవ్‌ ఫోన్‌ చేసి తన దగ్గర ఉన్న ఫొటోల వివరాలు చెప్పాడు. తాను చెప్పినట్లు వినకపోతే మీ అసభ్య చిత్రాలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరింపుల పర్వానికి తెరదీశాడు. ఒంటరిగా కలవాలని సూచించాడు. దీంతో చేసేది లేక భార్గవ్‌ చెప్పినట్లుగానే యువతి ఒంటరిగా కలిసింది. ఆ సమయంలో బెదిరించి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తరచూ కలవాలని వేధించ సాగాడు. డబ్బులు డిమాండ్‌ చేశాడు. అలా రూ. 3 లక్షలు వరకూ యువతి భార్గవ్‌కు ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులు కొనసాగడంతో.. తాళలేక చివరకు జరిగిన విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు నగర కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన మా చవరం పోలీసులు సోమవారం భార్గవ్‌ను అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ఆస్ట్రేలి యాలో ఉన్న రితేష్‌పై కూడా కేసు నమోదు చేశారు

అరెస్టును అడ్డుకునేందుకు టీడీపీ ఎంపీ విశ్వప్రయత్నం!
యువకుడిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసి.. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎంపీ పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆ యువకుడిని అరెస్టు చేయకుండా కాపాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పదేపదే నగర కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీసు అధికారులకు ఫోన్లు చేశారు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి ద్వారా కూడా సిఫార్సు చేయించినట్లు సమాచారం. అయితే ఎంపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 

>
మరిన్ని వార్తలు