చదివింది ఐదు.. ఒంటరి మహిళలే టార్గెట్‌!

20 Feb, 2018 12:38 IST|Sakshi

ఫేస్‌బుక్‌తో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌!

సాక్షి, హైదరాబాద్‌ : చదివింది అయిదో తరగతి, అయితేనేమీ ఫేస్‌బుక్‌ వాడటంలో మాత్రం ఆరితేరిన నిపుణుడు. దీంతో ఫేస్‌బుక్‌ ద్వారా ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి వశపరుచుకోవటమే కాకుండా అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు 20 మంది మహిళలు ఇతగాడి బారిన పడ్డారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించి చాలామంది మిన్నకుండిపోగా, ఓ బాధితురాలు మాత్రం ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో రంగస్వామి గుట్టురట్టు అయింది.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా బుక్కరాయపట్నంకు చెందిన రంగస్వామి చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. జల్సాలకు అలవాటు పడ్డ అతడు చిన్నతనం నుంచే  నేరాలకు పాల్పడేవాడు.  చదివింది ఐదో తరగతే అయినా ఫేస్‌బుక్‌ వాడటంలో రంగస్వామి దిట్ట. దీన్నే అస్త్రంగా భావించిన అతడు ఒంటరి మహిళలను టార్గెట్‌ చేశాడు. వారిని ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి లక్షల్లో దండుకొని పరారయ్యేవాడు. నగరంలోని నాచారం, లాలాపేట్‌, లాలాగూడలకు చెందిన సుమారు 20 మందికి పైగా మహిళలు మోసపోయారు. వీరంతా ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారు కావడం విశేషం.

పరువు పోతుందని చాలా మంది బాధితులు బయటకు రాలేదు. అయితే లాలాగూడకు చెందిన ఓ మహిళ రంగస్వామి తనను మోసం చేశాడని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి లక్షల్లో వసూలు చేసి పరారయ్యాడని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేశారు. రంగస్వామికి ఇదివరకే నేరచరిత్ర ఉంది.  చైన్‌ స్నాచింగ్‌, హత్యాయత్నం బెదిరింపు కేసులుకూడా నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయినా అతగాడి బుద్ధి మాత్రం మారలేదు. ప్రస్తుతం అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు