ఉద్యోగం... ప్రేమ... పెళ్లి... బెదిరింపులు!

3 Nov, 2018 09:41 IST|Sakshi

ఓ ప్రైవేట్‌ ఉద్యోగినిపై ‘ప్రయోగించిన’ కేటుగాడు

వివాహమైన విషయం దాచి ఆమెకు ప్రతిపాదనలు

సైబర్‌ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

నిందితుడి అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: తన వృత్తి నేపథ్యంలో పరిచయమైన యువతిపై కన్నేశాడు... తొలుత ఉద్యోగమంటూ ఎర వేసి డబ్బు గుంజాడు... ఆపై ప్రేమ, పెళ్లి అంటూ కొత్త నాటకానికి తెరలేపాడు... తాను వివాహితుడిననే విషయం ఆమెకు తెలిసేసరికి బెదిరింపులకు దిగాడు... ఇవి తారాస్థాయికి చేరడంతో బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేటుగాడిని శుక్రవారం పట్టుకున్న అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరానికి చెందిన యువతి ఓ పాఠశాలలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఆ స్కూల్‌ నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లతో పాటు విద్యార్థులు, వారి సంబంధీకులతో పాటు టీచర్లకూ బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు అందించే పరిజ్ఞానాన్ని ఓ ప్రైవేట్‌ సంస్థ అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందులో పని చేస్తున్న అజిత్‌ అనే యువకుడు తరచూ సదరు పాఠశాలకు వెళ్తుండేవాడు. సాంకేతిక అంశాలపై ఆ సిబ్బందికి ఏవైనా సందేహాలు వస్తే వారు వెంటనే ఇతడిని సంప్రదించి నివృత్తి చేసుకునేవారు. ఈ క్రమంలో పాఠశాలలో అకౌంటెట్‌గా పనిచేస్తున్న సదరు యువతి సైతం పలుమార్లు అజిత్‌ను సంప్రదించింది. ఈ పరిచయం నేపథ్యంలోనే ఇద్దరు పలుమార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అప్పటికే వివాహితుడైన అజిత్‌ భార్యకు నరకం కూడా చూపించాడు. దీంతో ఆమె ఇతడిపై కేసు పెట్టడంతో ప్రస్తుతం భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో తనకు వివాహమైన విషయం బయటకు చెప్పకుండా అజిత్‌ గోప్యత పాటించేవాడు. అకౌంటెంట్‌ అయిన యువతికి కూడా తనకు అప్పటికే వివాహమైన విషయం చెప్పలేదు. ఓ సందర్భంలో అజిత్‌ సదరు యువతికి ఉద్యోగం పేరుతో ఎర వేశాడు.

ఈసీఐఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఈ ఆశతో ఆమె అజిత్‌ కోరినప్పుడల్లా డబ్బు ఇస్తూ పోయింది. మొత్తమ్మీద ఆమె వద్ద ఉన్న వాటితో పాటు క్రెడిట్‌కార్డ్‌ స్వైపింగ్‌ ద్వారా రూ.1.7 లక్షలు కాజేశాడు. తన ఉద్యోగంతో పాటు తన వద్ద నుంచి తీసుకున్న నగదు విషయం ఆమె ప్రశ్నించడంతో ప్రేమ పేరుతో నాటకం మొదలెట్టాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఓ దశలో యువతి పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచిన అజిత్‌ ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను అందులో అప్‌లోడ్‌ చేశాడు. ఈ ఖాతా నుంచే నిత్యం ఆ యువతిని సందేశాలు పంపేవాడు. దీంతో బాధితురాలు అజిత్‌ విషయం ఆరా తీయగా అతడి వివాహం, వేధింపులు, వేరుపడటం... తదితరాల్నీ ఆమె దృష్టికి వచ్చాయి. దీంతో కంగుతిన్న బాధితురాలు అజిత్‌ తనను మోసం చేసేందుకు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. తన విషయం ఆ యువతికి తెలిసిందని గుర్తించిన అజిత్‌ మరో డ్రామాకు తెరలేపాడు.

‘నీవు లేకపోతే నేను లేను’ అంటూ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌ మొదలెట్టాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెకు బెదిరింపులతో పాటు కొన్ని అభ్యంతరకరమైన సందేశాలు, వీడియోలు పంపడం మొదలెట్టాడు. ఆమె చాటింగ్‌ చేసినట్లూ కొన్ని అంశాలను సృష్టించాడు. వీటిని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటంతో పాటు నన్ను పెళ్లి చేసుకోకుంటే నీతో పాటు కుటుంబాన్నీ అంతం చేస్తానంటూ బెదిరింపులు మొదలెట్టాడు. ఇతడి వ్యవహారశైలి తీవ్రస్థాయికి చేయడంతో బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ వెంకటరామిరెడ్డి నిందితుడిని గుర్తించారు. శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. అజిత్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా అని, జీవనోపాధి కోసం సిటీకి వచ్చినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు