అతడి ‘కాల్‌’... హడల్‌!

23 Jan, 2019 05:55 IST|Sakshi

మెదక్‌ జిల్లాలోని ఓ ఊరిని గడగడలాడించిన వైనం

తనతో గొడవపడిన భార్యకు మద్దతుగా నిలిచినందుకే

కొన్ని నెలల పాటు నరకం చూపిన దుండగుడు

బాగుపడమన్నందుకు బావపై కోపంతో అతడినీ టార్గెట్‌

నిందితుడిని అరెస్ట్‌ చేసిన సనత్‌నగర్‌ పోలీసులు

సిటీకి చెందిన ఓ వెల్డర్‌ మెదక్‌ జిల్లాలోని ఓ గ్రామాన్ని హడలెత్తించాడు. అక్కడి మాజీ సర్పంచ్‌ సహా 15మంది పెద్ద మనుషులను భయాందోళనకు గురిచేశాడు. సెకండ్‌హ్యాండ్‌ సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసిన అతడు.. అందులో దొరికిన సిమ్‌కార్డును వేసి బెదిరింపుల పర్వానికి దిగాడు. అసలు ఎందుకీ పని చేశాడని పోలీసులు విచారించగా ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. సదరు గ్రామానికి చెందిన ఇతగాడి భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లగా, అక్కడి పెద్ద మనుషులు ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనికే పగ పెంచుకున్న వెల్డర్‌ వారందరినీ ముప్పుతిప్పలు పెట్టాడు.

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వెల్డర్‌ మెదక్‌ జిల్లాలోని ఓ ఊరిని గడగడలాడించాడు... ఇతడి ఫోన్‌ బారినపడిన వారిలో ఆ ప్రాంతానికి చెందిన మాజీ సర్పంచ్‌తో దాదాపు 15 మంది పెద్ద మనుషులు ఉన్నారు... కొన్ని నెలల పాటు వారికి నరకం ‘వినిపించాడు’.. తనతో గొడవపడిన భార్యకు ఆ ఊరంతా మద్దతుగా నిలవడమే ఇందుకు కారణం...చివరకు అతను దీన్‌దయాళ్‌నగర్‌లో ఉన్న సమీప బంధువునూ టార్గెట్‌గా చేసుకున్నాడు... ఈ కేసు దర్యాప్తు చేసిన సనత్‌నగర్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. సనత్‌నగర్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

తన భార్యకు వత్తాసు పలికారనే...
సనత్‌నగర్‌ ఠాణా పరిధిలోని దీన్‌దయాల్‌నగర్‌లో ఉంటున్న కె.విజయ్‌ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్‌ కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. అతను మెదక్‌ జిల్లా, అల్లాదుర్గ్‌ సమీపంలోని గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీరి మధ్య స్పర్థలు తలెత్తడంతో విజయ్‌ భార్యను వేధించడం మొదలెట్టాడు. దీంతో ఆమె తన గ్రామానికి చెందిన పెద్దల మధ్య పంచాయితీ పెట్టింది. అప్పటి సర్పంచ్, పెద్ద మనుషులు పలుమార్లు అతడిని పిలిపించి మాట్లాడారు. అయినా అతడి వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో మరోసారి పిలిచి గట్టిగా మందలించారు. దీంతో విజయ్‌ ఆ గ్రామంలో ఉన్న నాటి సర్పంచ్‌తో పాటు పెద్దలపై కక్షకట్టాడు. 

దొరికిన సిమ్‌కార్డు వాడేసుకుని...
ఈ గ్రామానికి చెందిన వారిపై ఎలా కక్ష తీర్చుకోవాలని ఆలోచిస్తున్న విజయ్‌కి కొన్నాళ్ల క్రితం సనత్‌నగర్‌ ప్రాంతంలో ఓ సిమ్‌కార్డు దొరికింది. దీనిని తనకు అనువుగా మార్చుకోవాలనుకున్న అతను ఓ సెకండ్‌హ్యాండ్‌ ఫోన్‌ ఖరీదు చేశాడు. ఇందులో ఆ సిమ్‌కార్డు వేసి తన ‘పని’ ప్రారంభించాడు. తన భార్య ఊరికి చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు పెద్ద మనుషుల ఫోన్‌ నెంబర్లను సేకరించాడు. వాటికి కాల్స్‌ చేస్తూ తొలుత మహిళ మాదిరిగా మాట్లాడేవాడు. ఆపై అసలు గొంతుతో మాట్లాడుతూ చెప్పనలవి కాని భాషలో దూషించేవాడు. ఎవరైనా ఫోన్లు ఎత్తకపోతే వారికి సంక్షిప్త సందేశాలు పంపేవాడు. విజయ్‌ దెబ్బకు ఆ గ్రామానికి చెందిన దాదాపు 15 మంది హడలెత్తిపోయారు. ఏ వేళలో పడితే ఆ వేళలో ఫోన్లు మోగడం, ఎత్తితే అన్ని భాషల్లోనూ దూషణలు వినిపించడంతో ఓ దశలో ఏం చెయ్యాలో పాలుపోక అవస్థలు పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో విజయ్‌ టార్చర్‌ను భరించారు. 

సమీప బంధువు ఫిర్యాదుతో...
ఇదిలా ఉండగా సనత్‌నగర్‌ ప్రాంతానికే చెందిన విజయ్‌ సమీప బంధువు కూడా ఓ దశలో అతడికి టార్గెట్‌గా మారాడు. రాజకీయ పార్టీల కోసం తిరగకుండా పద్దతిగా ఉండమని మందలించిన పాపానికీ అతడి పైనా విజయ్‌ ‘ఫోన్‌ కట్టాడు’. సమీప బంధువుతో పాటు అతడి భార్య, ఇద్దరు కుమారులకు ఫోన్లు చేస్తూ తిట్టడం మొదలెట్టాడు. ఈ బాధ భరించలేక అతను గత నెలలో సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సందర్భంలోనూ ఇతడి వెన్నంటే వచ్చిన విజయ్‌... ఠాణా నుంచి బయటకు రాగానే ‘నా మీద పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్నావా? నీ అంతు చూస్తా’ అంటూ బెదిరింపు ఎస్సెమ్మెస్‌ పంపాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ఆరా తీయగా అది కర్నూలుకు చెందిన వ్యక్తి పేరుతో ఉన్నట్లు తేలింది. అతడి సంప్రదించగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్లిన అధికారులు నిందితుడు విజయ్‌గా గుర్తించారు. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో తన సమీప బంధువు తనను పార్టీ మారమంటూ ఒత్తిడి చేయడంతోనే కక్షకట్టానంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు