వివాహితను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

30 Oct, 2018 08:54 IST|Sakshi
సోనల్‌ చౌహన్‌

సాక్షి, సిటీబ్యూరో: ఓ వివాహితకు అసభ్యకర సందేశాలు, చనువుగా ఉన్నప్పటి ఫొటోలు ఆమె కుటుంబసభ్యులకు వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా పంపిస్తూ ఆన్‌లైన్‌లో వేధిస్తున్న వ్యక్తిని  ముంబై నుంచి ట్రాన్సిట్‌వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లక్నో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ హెచ్‌ఆర్‌ పూర్తి చేసిన సోనల్‌ చౌహన్‌ వోడాఫోన్‌తో పాటు వివిధ సంస్థల్లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేశాడు. 2015లో అతను హైదరాబాద్‌లో వోడాఫోన్‌లో పనిచేస్తున్న సమయంలో బాధితురాలు సీనియర్‌ హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేది. ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్‌ఫోన్‌ కెమెరాతో సెల్ఫీలు తీశాడు. 2015 జూన్‌లో ముంబైలోని భారతి ఆక్సా ఇన్సూరెన్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా చేరిన సోనల్‌ చౌహన్‌ బాధితురాలికి కూడా అదే కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. 

బాధితురాలి ఫ్లాట్‌కు తరచూ వెళ్లి ఆమెకు తెలియకుండానే ఫొటోలు, ఈ–మెయిల్స్, ఫోన్‌ నంబర్లు, వ్యక్తిగత సమాచారం సేకరించాడు. అనంతరం ఆమె ఫొటోలను పంపి తన కోరిక తీర్చకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించేవాడు. అతడిపై బాధితురాలు కంపెనీలో ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.  అనంతరం బాధితురాలికి ఎన్‌ఆర్‌ఐతో వివాహం జరిగింది. తన ఉద్యోగం పోవడానికి ఆమే కారణమని కక్ష పెంచుకున్న సోనల్‌ చౌహన్‌ తన వద్ద ఉన్న బాధితురాలి వ్యక్తిగత ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, భర్తకు వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా పంపించాడు. హైదరాబాద్‌లోనే ఉన్న బాధితురాలు అక్టోబర్‌ 29న రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో టెక్నికల్‌ డాటాతో నిందితుడు ముంబైలో ఉన్నట్లుగా గుర్తించి అరెస్టు చేశారు. ట్రాన్సిట్‌ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు.   

మరిన్ని వార్తలు