గ్రూప్‌ 2 ఉద్యోగాలు: భారీ మోసం 

16 May, 2018 13:25 IST|Sakshi
నిందితుడు ప్రకాష్‌ వర్మ

బోగస్‌ ఐడీతో బురిడీ

రూ. 12 లక్షలు వసూలు 

నిందితుడి అరెస్టు   

సాక్షి, సిటీబ్యూరో: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 నోటిఫికేషన్‌లో భాగంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ప్రకాష్‌ వర్మ అనే వ్యక్తిని వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతను నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకోవడంతో పాటు అనేక మందికి బోగస్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు మంగళవారం వెల్లడించారు. మెదక్‌ జిల్లాకు చెందిన ప్రకాష్‌ వర్మ తండ్రి ప్రేమ్‌ శ్యామ్‌ కుమార్‌ ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసి రిటైర్‌ అయ్యారు. అతడి తల్లి ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పని చేసే వారు. ఆమె బదిలీ నేపథ్యంలో 15 ఏళ్ల క్రితం సిటీకి వలసవచ్చి సుచిత్ర వద్ద స్థిరపడింది. 2013లో తల్లి చనిపోవడంతో ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ప్రకాష్‌ ఉద్యోగం రాకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు, అధికారులతో వ్యవహరించాల్సిన తీరు తెన్నులు తెలుసుకున్నాడు. ఈ ‘అనుభవంతో’ అమాయకులను మోసం చేయడానికి రంగంలోకి దిగాడు.

తాను కోఠి ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీనిని నిరుద్యోగులకు చూపించి తానో ప్రభుత్వోద్యోగినని, అధికారులతో సంబంధాలు ఉన్నాయని నమ్మించాడు. 2016 గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ఆధారంగా దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. దాదాపు ఎనిమిది మంది నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసి వారిని ఖైరతాబాద్‌ ఎమ్మార్వో ఆఫీస్‌లో జూనియర్‌ అసిస్టెంట్స్‌గా నియమిస్తున్నట్లు బోగస్‌ నియామక పత్రాలు అందజేశాడు. వీటితో అక్కడికి వెళ్లిన బా«ధితులు మోసపోయినట్లు గుర్తించారు. వీరి ఫిర్యాదుతో పంజగుట్ట, పేట్‌ బషీరాబాద్‌ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రకాష్‌ కదలికలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎల్‌.భాస్కర్‌రెడ్డి, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్‌ వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.3.5 లక్షల నగదు, నకిలీ గుర్తింపుకార్డు, నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించారు.   

మరిన్ని వార్తలు