ఒక్కడే... మూడు పేర్లు 

9 Jun, 2018 16:41 IST|Sakshi

లక్షల్లో చీటింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌‌: వేర్వేరు పేర్లతో ఆధార్‌ కార్డు, ఓట రు కార్డు, పాన్‌ కార్డులు తీసుకుని వాటి ద్వారా ఓ వ్యాపారిని మోసం చేసిన సంఘటనలో నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేర కు వివరాలిలా ఉన్నాయి... విజయవాడ పాయకాపురం ప్రాంతానికి చెందిన అమృతపూడి రవి అలియాస్‌ షేక్‌ రియాజ్‌ అలియాస్‌ శంకర్‌రెడ్డి హర్షా ఫార్మా పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేసి తాను మందులు సరఫరా చేస్తానంటూ రామంతపూర్‌ ఇందిరానగర్‌లో నివసించే వ్యాపారి మేకల సతీష్‌ను నమ్మించాడు.

కొద్ది రోజులు మందులు బాగానే సరఫరా చేసిన రవి ముందస్తు పథకం ప్రకారం తాన్వి మెడికల్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా షేక్‌ రియాజ్‌ బాబు, శంకర్‌రెడ్డిలను పేర్కొంటూ వారు కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తారని రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తే బల్క్‌ఆర్డర్లు బుక్‌ చేయవచ్చని చెప్పడంతో నమ్మిన సతీష్‌ ఆ మేరకు డబ్బులు పంపించాడు. అయితే రోజులు గడిచినా డ్రగ్స్‌ సరఫరా కాకపోవడంతో ఇదేమిటని నిలదీస్తే రవి ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని ప్రదీప్‌ బంజారా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అతని సోదరుడి వద్దకు వెళ్లి ఆరా తీయగా  రవి ఒక్కడేనని షేక్‌రియాజ్, శంకర్‌రెడ్డి పేర్లతో ఆధార్‌ కార్డు తయారు చేశాడని తేలింది. తరచూ పేర్లు మారుస్తూ ఎంతో మందిని మోసం చేశాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు