తమ్ముడి హత్య కేసులో అన్న అరెస్టు

21 Apr, 2018 12:36 IST|Sakshi
నిందితుడిని అరెస్టు చూపుతున్న ఏసీపీ రక్షిత కె.మూర్తి

హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం

కోల్‌సిటీ(రామగుండం) : తమ్ముడిని హత్య చేసిన కేసులో పాతనేరస్తుడైన అన్నను శుక్రవారం గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి అరెస్టు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వివరాలను వెల్లడించారు. లెనిన్‌నగర్‌కు చెందిన ధనాల దుర్గారావు అలియాస్‌ చంటి(23) అనే యువకుడిని, రామగుండంలోని మజీద్‌రోడ్‌లో ఉంటున్న అతని అన్న ధనాల చంద్రశేఖర్‌ ఈనెల 16న కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు.

భార్య, పిల్లలతో రామగుండంలో ఉంటూ కూలి పని చేసుకుంటున్న చంద్రశేఖర్‌ మద్యానికి బానిసయ్యాడు. ఖర్చులకు డబ్బులు కావాలంటూ లెనిన్‌నగర్‌లోని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి గొడవ చేసేవాడు. రెండు లక్షల రూపాయాలతోపాటు ఇంటిలో వాటా కావాలంటూ హత్య జరిగిన రెండ్రోజుల ముందు గొడవ చేశాడు. ఈనెల 16న సాయంత్రం ఇదే విషయంపై మళ్లీ తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాలని, ఇంటిలో వాటా ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు.

డబ్బుల కోసం మమ్మల్ని కొట్టడానికి ఇంటికి వస్తున్నావు, నీకు డబ్బులు ఇవ్వము, ఇంట్లోంచి వెళ్లిపోవాలని తల్లి అనడంతో ఆగ్రహంతో తల్లిపై కత్తితో పొడవబోయిన చంద్రశేఖర్‌ను అప్పటికే ఇంట్లో ఉన్న రెండో తమ్ముడు శివశంకర్, చిన్న తమ్ముడు దుర్గారావు, తండ్రి రామారావు అడ్డుకున్నారు. దీంతో మరింత కోపానికి లోనై తమ్ముడు దుర్గారావును కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రరక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్సకోసం కరీంనగర్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

గురువారం సాయంత్రం చంద్రశేఖర్‌ను రామగుండంలోని అతడి ఇంటివద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి దగ్గర కత్తితోపాటు ద్విచక్రవాహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా చంద్రశేఖర్‌ ఇప్పటికే 12 దొంగతనం కేసులతోపాటు ఒక హత్య కేసు, ఇల్లును తగులబెట్టిన కేసులో నిందితుడుగా ఉన్నాడని ఏసీపీ తెలిపారు.

నేరం చేస్తే కఠిన చర్యలు..

నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రక్షిత కె.మూర్తి హెచ్చరించారు. చిన్నచిన్న సమస్యలకే హత్యలకు పాల్పడడం విచిత్రంగా ఉందన్నారు. నగరంలో ప్రతీరోజూ ప్రత్యేక పోలీసుల బృందాలు తనిఖీలు చేపడుడుతాయని.. ఎవరైన అసాంఘీక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర ప్రజలు కూడా గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో సీఐ వాసుదేవరావు, ఎస్సై దేవయ్య, ఏఎస్సై శారద, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. – రక్షిత కె.మూర్తి, ఏసీపీ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు