అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుని...

24 Nov, 2018 18:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పదమూడేళ్ల వయస్సున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తి... ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు పథకం రచించాడు. ఆమెకు మైనార్టీ తీరే వరకు వేచి చూసి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆనాటి నుంచి తన వికృత బుద్ధిని మరోసారి బయటపెడుతూనే ఉన్నాడు.

ముంబై : కట్నం కోసం భార్యను వేధిస్తున్న కేసులో 32 ఏళ్ల వ్యక్తిని కర్లా పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గృహహింస, హత్యాయత్నం తదితర కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలు..  కర్లా ఏరియాకు చెందిన ఓ వ్యక్తి ఆరేళ్ల క్రితం ఓ పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నుంచి బయటపడటం కోసం బాధితురాలితో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఆమెకు పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అన్నట్లుగానే గతేడాది ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి కట్నం తేవాలంటూ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.

పెట్రోలు పోసి తగలబెట్టారని చూశారు..
‘ఆరో తరగతి చదువుతున్నపుడు అతడు నాపై అకృత్యానికి ఒడిగట్టాడు. మా ఇద్దరికీ వయసులో దాదాపు 13 ఏళ్ల తేడా ఉంది. పెళ్లైన మొదటి రెండు మూడు నెలలు బాగానే చూసుకున్నాడు.  ఆ తర్వాత నుంచి 9 లక్షల రూపాయలు కట్నంగా తేవాలని రోజూ హింసించేవాడు. అందుకు మా అత్తగారు కూడా వంతపాడేది. నువ్వు పెట్టిన కేసు నుంచి విడిపించుకోవడానికే 9 లక్షలు ఖర్చు అయింది. అదంతా నువ్వే చెల్లించాలి. లేకపోతే నా కొడుకుకు విడాకులు ఇవ్వు అని వేధించేది. అయినా నేను వాళ్లింట్లోనే ఉండటంతో కోపంతో ఓ రోజు నాపై కిరోసిన్‌ పోసి అంటించేందుకు ప్రయత్నించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న మా అమ్మానాన్నలు నన్ను పుట్టింటికి తీసుకువెళ్లారు. అయినా అతడికి నాపై పగ చావలేదు. నా వాట్సప్‌ ప్రొఫైల్‌ పిక్‌ను మార్ఫింగ్‌ చేసి అశ్లీల వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని పట్టించాను’ అని బాధితురాలు తన ఆవేదన వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలో అతడిపై పలు అభియోగాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు