హత్య.. ఆత్మహత్య..మధ్యలో మద్యం

28 May, 2020 08:38 IST|Sakshi
హఫీజ్‌ (ఫైల్‌) ,సలీం (ఫైల్‌)

సిమెంటు ఇటుకతో అంతమొందించాడు

మద్యం.. వారి విచక్షణను కోల్పోయేలా చేసింది.. మత్తులో ఉన్న వారు తామేం చేస్తున్నామో తెలుసుకోలేని స్థితికి వెళ్లిపోయారు.. ముందు..వెనుకా ఆలోచించలేదు.. కుటుంబం గురించి పట్టించుకోలేదు.. ఆవేశం కట్టలు తెంచుకుంది.. వారి చర్యలతో ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే.. మరొకరు హత్యచేశారు. నగరంలోని వేర్వేరు చోట్ల ఈ రెండు సంఘటనలు జరిగాయి. 

జగద్గిరిగుట్ట: పాత కక్షల నేపథ్యంలో హఫీజ్‌ (21) అనే యువకుడు  హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట సీఐ గంగరెడ్డి తెలిపిన మేరకు.. గాజులరామారం డివిజన్‌ శ్రీరాంనగర్‌కు చెందిన అక్బర్‌(31) అటో డ్రైవర్‌. రంజాన్‌ పండగ అనంతరం విందు చేసుకోవాలని అదే ప్రాంతానికి చెందిన జావీద్‌(19) అన్నులు కలిసి మద్యం తాగుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన హఫీజ్‌ కారు మెకానిక్‌ వీరి వద్దకు వచ్చి నా సోదరుడు జావీద్‌తో ఎందుకు మద్యం తాగుతున్నావని అక్బర్‌తో గొడవకు దిగాడు. అనంతరం నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అక్బర్‌ మరోసారి మద్యం కొనుగోలు చేసి తాగేందుకు వెళ్తున్నాడు. ఇది గమనించిన హఫీజ్‌ అక్బర్‌తో మరోమారు గొడవ పడటం ప్రారంభించాడు. గతంలో అక్బర్‌ను చంపుతానంటూ హఫీజ్‌ బెదిరించాడు. దీంతో తనను అంతమొందించెందుకే గొడవ పడుతున్నాడని భావించిన అక్బర్‌ హఫీజ్‌ను కిందపడేసి పక్కనే ఉన్న సిమెంటో ఇటుకతో తలపై మోదాడు. దీంతో తలకు తీవ్ర గాయమైన హాఫీజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతంరం అక్బర్‌ జగద్గిరిగుట్ట ఠాణాలో లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.(ఉద్యోగం పేరుతో వ్యభిచార రొంపిలోకి.. )

బ్లేడుతో చేయికోసుకొని ప్రాణం వదిలాడు 
దూద్‌బౌలి: మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.  ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కొత్వాల్‌ తెలిపిన మేరకు.. కాకినాడకు చెందిన సలీం (38) నగరంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు.కొద్ది రోజులుగా భార్య కాకినాడ నుంచి ఫోన్‌ చేసి డబ్బు కోసం అడుగుతూ ఉండేది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సలీం వద్ద డబ్బులు లేకపోవడంతో భార్యతో తరచుగా గొడవ పడుతుండేవాడు.   మద్యానికి బానిసైన సలీం.. ఇక డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్‌లో భార్యకు బెదిరించేవాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో విపరీతంగా మద్యం తాగిన సలీం ఫోన్‌లో భార్యతో గొడవ పడి అక్కడే ఉన్న బ్లేడ్‌తో ఎడమచేయిపై తీవ్రంగా గాయాలు చేసుకున్నాడు.

రక్తస్రావం జరగడంతో అపస్మారకస్థితిలో చేరుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల వరకు సలీం తలుపులు తెరవకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూడగా మృతి చెంది ఉన్నాడు.  చార్మినార్‌ ఏసీపీ అంజయ్య, హుస్సేనీఆలం ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కొత్వాల్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు కాకినాడలో ఉండే భార్యకు సమాచారం అందించారు.   

మరిన్ని వార్తలు