పంచాయితీ వద్దన్నందుకు..ప్రాణమే పోయింది

12 Mar, 2020 09:22 IST|Sakshi
పరమేశ్‌ (ఫైల్‌) ,ఘటనా స్థలంలో కారును పరిశీలిస్తున్న పోలీసులు

హయత్‌నగర్‌లోఇద్దరు యువకుల ఘాతుకం

వాహనాలు పరస్పరం ఢీకొనడంతో వివాదం

ఘర్షణ పడుతుంటే వారించిన ఇద్దరు యువకులు  

దీంతో కక్షగట్టి తమ కారులో ఎక్కించుకుని దాడి

ఈ నేపథ్యంలో పల్టీలు కొట్టిన కారు

మధ్యవర్తిగా వ్యవహరించిన యువకుడి మృతి

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో పరస్పర వాహనాలు ఢీకొట్టిన ఘటనలో పంచాయితీ వద్దన్నందుకు ఒకరి ప్రాణమే పోయింది.  కారు, బైక్‌ ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బైకర్‌తో గొడవపడుతున్న సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు వారించి బైకర్‌ను పంపించారు. దీన్ని తట్టుకోలేక కారులోని వ్యక్తులు మధ్యవర్తిగా వ్యవహరించిన ఇద్దరిని వాహనంలో ఎక్కించుకొని పిడిగుద్దులు కురిపిస్తున్న సమయంలో అనూహ్యంగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మధ్యవర్తిగా వ్యవహరించిన పరమేశ్‌ మృతి చెందాడు. మామిడి రాజు గాయపడ్డాడు. మృతుడు పరమేశ్‌ భార్య వనజారాణి ప్రస్తుతం గర్భిణి. ఇటీవలే అతని కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. కొడుకు భరద్వాజ్‌ ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు మండలం గొల్నెపల్లికి చెందిన సింగపాక పరమేశ్‌ (29) పెద్దంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌కే నగర్‌లో నివాసముంటూ సమీపంలో ఉన్న ప్రీమీ లామినేషన్‌ డోర్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని తోటి కార్మికుడు మామిడి రాజుకు చెందిన టాటా ఏస్‌ ఆటోలో మర్రిపల్లి వైపు వస్తున్నారు.

అంతకు ముందు వారి కంపెనీలోనే పనిచేసే సూపర్‌వైజర్‌ శ్రీనాథ్‌ అదే దారిలో బైకుపై వెళ్లాడు. అతని బైక్‌ ఫతుల్లాగూడకు చెందిన కాటెపాక సతీష్, మర్రిపల్లికి చెందిన ఒంగూరు ప్రశాంత్‌లు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో వారు శ్రీనాథ్‌తో గొడవకు దిగారు. వారి మద్య వాగ్వాదం నడుస్తుండగానే ఇదే మార్గంలో వెళుతున్న పరమేష్, రాజులు తమ వాహనం ఆపారు. ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. వారికి తోడుగా కొందరు గ్రామస్తులు వచ్చి నచ్చజెప్పడంతో శ్రీనాథ్‌ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. దీంతో తమకు పరిహారం ఇవ్వకుండానే అతడిని పంపిస్తారా... అతడిని తమకు చూపించండి.. అంటూ పరమేష్, రాజులతో సతీష్, ప్రశాంత్‌లు వాగ్వాదానికి దిగారు. వారు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా కొట్టి బెదిరించి కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. కారులో వారిపై దాడి చేస్తూ పరిసర ప్రాంతంలో తిప్పారు. ఈ క్రమంలో  పెనుగులాట జరగడంతో అధిక వేగంతో ఉన్న కారు కుంట్లూర్‌ రాజీవ్‌ గృహకల్ప సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న సతీష్, ప్రశాంత్‌లు కారు దిగి పారిపోయారు. పరమేశ్, రాజులు తీవ్రంగా గాయపడ్డారు. రాజు ఇచ్చిన సమాచారంతో వారి కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా పరమేశ్‌ మార్గమధ్యలో మృతి చెందాడు. గాయపడ్డ రాజును ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. నిందితులు ప్రశాంత్, సతీష్‌లు డ్రైవర్లుగా పనిచేస్తూనే జులాయిగా తిరుగుతూ పలు నేరాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్‌పై హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌లో రెండు కేసులన్నాయని సీఐ సతీష్‌ తెలిపారు. వారు ఓ కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితులు మార్గమధ్యలో మద్యం తాగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి..  
మృతుడు పరమేశ్‌ కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీస్‌ నాయకులు మల్లెపాక అనీల్‌కుమార్, జోగు రాములు, బీసీ సంఘం నాయకురాలు తండ ఉపేంద్రయాదవ్‌లు మాట్లాడుతూ.. నిందితులు కావాలనే పరమేష్‌ను హత్య చేశారని, వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కఠినంగా విక్షించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు