ప్రేమ నిరాకరించిందని యువతికి కత్తిపోట్లు 

30 Jun, 2019 08:28 IST|Sakshi
ఘటన స్థలంలో గుమికూడిన గ్రామస్థులు, సుశాంత్‌ (ఫైల్‌)

మంగళూరులో యువకుడి ఘాతుకం 

ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నం

సాక్షి, బెంగళూరు : ఓ పిచ్చి ప్రేమికుడు తన ప్రియురాలిని చాకుతో పొడిచి, తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళూరులో చోటు చేసుకొంది. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. మంగళూరు శక్తినగరకు చెందిన సుశాంత్‌ బగంబిలా గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. సుశాంత్‌ హైస్కూల్‌లో డ్యాన్స్‌ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య హైస్కూల్‌ నుండి ప్రేమ ఉంది. దీంతో ఇటీవల జరిగిన సదరు యువతి పుట్టిన రోజుకు సుశాంత్‌ రూ. 50 వేలు ఖర్చు చేశాడు. అయితే ఇటీవల కాలంలో యువతి యువకుడికి దూరంగా ఉంటోంది. దీంతో ప్రేమికుడు యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. దీంతో యువతి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కక్ష పెంచుకున్న సుశాంత్‌ తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఆగ్రహంతో ఉన్నాడు.

శుక్రవారం సదరు యువతిని హత్య చేయడానికి మంగళూరు నుంచి బగంబిలా గ్రామానికి వెళ్లాడు. సాయంత్రం కాలేజీ నుండి ఆమె వచ్చేవరకు ఆమె ఇంటి వద్దనే ఉన్నాడు.   యువతి రాకను గమనించి ముందుగానే తెచ్చుకున్న చాకుతో ఆమె కడుపుపై 12 సార్లు పొడిచాడు. బాధితురాలు ప్రాధేయపడినా కనికరించలేదు. అనంతరం అదే చాకుతో తాను గొంతు కోసుకున్నాడు. హఠాత్‌ పరిణామాన్ని గుర్తించిన స్థానికులు ఇద్దరి ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో దృశ్యాలు మొత్తం రికార్డయ్యాయి. దాడికి ముందు సుశాంత్‌ గంజాయి సేవించినట్లు సమాచారం. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో కొద్దిగా తేరుకున్న సుశాంత్, తన ప్రియురాలు ఎలా ఉందని వాకాబు చేశాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు