బైక్‌ ఇవ్వలేదని గొడ్డలితో..

22 Aug, 2019 11:11 IST|Sakshi
దాడిలో గాయపడిన నగేష్‌

సాక్షి, యాదగిరిగుట్ట: బైక్‌ ఇవ్వలేదన్న అక్కసులో ఓ యువకుడు ఇద్దరు యువకులపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన బాధిత యువకుల తండ్రి తలపై గొడ్డలి వేటు పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి యాదగిరిగుట్ట పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద నివాసం ఉండే బొమ్మ నిఖిల్, నీరజ్‌ ఇద్దరు అన్నదమ్ములతో అంగడి జజార్‌లో ఉండే కరుణాకర్‌కు మధ్య ఇటీవల బైక్‌ విషయంలో గొడవ జరిగింది.

ఇది మనసులో పెట్టుకున్న కరుణాకర్‌ వైకుంఠ ద్వారం వద్ద ఉండే నీరజ్, నిఖిల్‌పై కక్ష పెట్టుకున్నాడు. దీంతో మంగళవారం రాత్రి నిఖిల్, నీరజ్‌ ఉండే ఇంటికి కరుణాకర్‌ మారణాయుధాలతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడబోయాడు. గమనించిన నిఖిల్, నీరజ్‌లు ఇంట్లోకి పరుగులు తీశారు. తలుపులు పెట్టుకున్న తర్వాత కూడా దాడికి యత్నిస్తున్న కరుణాకర్‌ను నిఖిల్, నీరజ్‌ల తండ్రి నగేష్‌ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కరుణాకర్‌ తన వద్ద ఉన్న గొడలితో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో నగేష్‌ తలపై గొడ్డలి వేటు పడింది. బలమైన గాయమైంది. వెంటనే కరుణాకర్‌ అక్కడి నుంచి పారి పోయాడు. నగేష్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్సం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి సికింద్రబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో కరుణాకర్, నిఖిల్‌ మధ్యలో గొడవలు జరిగాయని, వారిని నిఖిల్‌ కుటుంబ సభ్యులు కూర్చోపెట్టి రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. పాత కక్షలతో పాటు బైక్‌ విషయంలో వచ్చిన గొడవ ఇంతకు దారి తీసిందని స్థానికలు అంటున్నారు. నగేష్‌తో పాటు ఆయన కుమారులు నీరజ్, నిఖిల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన కరుణాకర్‌ను పట్టణ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నగేష్‌ భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, కరుణాకర్‌ను రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు