షాపు మూసి భార్యపై హత్యాయత్నం

11 Aug, 2019 12:35 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతి సుబ్రహ్మణ్యం..   

కత్తితో విచక్షణారహితంగా దాడి

స్థానికలు షట్టర్‌ తెరిచి ఆమెను ఆస్పత్రికి తరలింపు

భర్త కూడా చేతిపై కోసుకుని హల్‌చల్‌

సాక్షి, ఒంగోలు : స్థానిక వీఐపీ రోడ్డు ఆదిత్య ప్రధానమంత్రి జన జీవన ఔషధి కేంద్రంలోకి శనివారం సాయంత్రం ఓ వ్యక్తి హడావుడిగా వచ్చాడు. లోపలకు వెళ్లి షట్టర్‌ బిగించి కత్తితో ఆ షాపులో పనిచేస్తున్న తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె పెనుగులాడుతూ బిగ్గరగా కేకలేసింది. స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. షట్టర్‌ లోపల లాక్‌ చేసి ఉందని గుర్తించి గడ్డ పలుగుతో బలవంతంగా షట్టర్‌ పైకి లేపి యువతిని బయటకు తీసుకొచ్చి ఆమెను స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

మరో వైపు లోపల ఉన్న యువకుడిని బయటకు రానీయకుండా షట్టర్‌ మూశారు. ఈ క్రమంలో యువకుడు తన చేతిని కోసుకొని హల్‌చల్‌ చేశాడు. అక్కడకు చేరుకున్న రక్షక్‌ పోలీసులు హుటాహుటిన అతడిని అదుపులోకి తీసుకొని రిమ్స్‌కు తరలించారు. భర్త పెనుగులాడటంతో గొంతు మీద కోయాలనే అతని యత్నం ఫలించక గడ్డం, ఛాతి భాగం, పొట్టపై పలుచోట్ల కత్తిగాట్లు పడ్డాయి. రక్తం పెద్ద మొత్తంలో పోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఆమెను గుంటూరు తరలించారు. 

ఇదీ..కథ
క్షతగాత్రురాలి పేరు బుర్రా జ్యోతి. మైనంపాడుకు చెందిన సుబ్రహ్మణ్యంతో ఐదేళ్ల క్రితం వివాహమైంది.  జ్యోతి కుటుంబం ఒంగోలులోని వీఐపీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యానికి ఎటువంటి ఆదాయం లేకపోవడంతో జ్యోతి తమ ఇంటికి సమీపంలోని జన ఔషధి కేంద్రంలో పనిచేస్తోంది. ఇటీవల దాదాపు లక్ష రూపాయల వరకు సుబ్రహ్మణ్యం పలుచోట్ల అప్పులు చేశాడు. అంతే కాకుండా జ్యోతి సోదరి పేరుతో ఒక మొబైల్‌ను ఈఎంఐలో తీసుకొని వాయిదాలు చెల్లించడం  మానేశాడు.

కుటుంబంలో వివాదం ప్రారంభమైంది. ఇటీవల చెప్పకుండా వెళ్లిపోయిన సుబ్రహ్మణ్యం శనివారం నేరుగా ఆమె పనిచేసే షాపులోకి వెళ్లి షాపు యజమాని లేని సమయంలో దాడికి పాల్పడ్డాడని బంధువులు పేర్కొంటున్నారు. వీరికి మూడేళ్ల పాప, ఒక ఏడాది బాబు ఉన్నాడు. విషయం తెలుసుకున్న తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్‌ఐ దేవప్రభాకర్‌లు సంఘటన స్థలానికి, ఆస్పత్రికి చేరుకొని మహిళ బంధువులను విచారించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యాన్ని కూడా విచారించారు. 

మరిన్ని వార్తలు