సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..

9 Nov, 2019 10:34 IST|Sakshi

నడిరోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి

పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు

వివాహేతర సంబంధమే కారణం

పరారీలో నిందితుడు: మిర్యాలగూడలో ఘటన

సాక్షి, మిర్యాలగూడ: కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఓ వ్యక్తి యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన  శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగుపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వజ్రం గతంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక మిల్క్‌ సెంటర్‌లో పని చేసేవాడు. అక్కడ ఓ భర్త లేని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత వారిద్దరూ మిర్యాలగూడకు వచ్చి టాకారోడ్డులో నివాసముంటూ సహజీవనం చేస్తున్నారు. వజ్రం పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపులో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారు అద్దెకు ఉండే ఇంట్లోనే మరో గదిలో అద్దెకు ఉంటున్న నకిరేకల్‌కు చెందిన తాండు రాజు ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వజ్రం గమనించాడు.

అప్పటి నుంచి ఆమె అనుమానం పెంచుకుని  తరుచూ కొట్టసాగాడు. దీంతో కొద్ది రోజుల క్రితం ఆ మహిళ ఇక్కడి నుంచి తన తల్లి గారి ఊరు భూదాన్‌పోచంపల్లికి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజు కారణంగానే తాను సఖ్యతగా మెలుగుతున్న మహిళ తనను విడిచి వెళ్లిపోయిందని ఇటీవల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ చేసిన సీఐ ఆ మహిళను మూడు రోజుల క్రితం పిలిపించి వివరాలు సేకరించారు. ఆ మహిళ తాను ఎవరిని వివాహం చేసుకోలేదని, ఎవరితోనూ తనకు సంబంధం లేదని తేల్చి చెప్పి తిరిగి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజుపై కక్ష పెంచుకున్న బొల్లెపల్లి వజ్రం పథకం ప్రకారం రోడ్డుపై నడిచి వెళుతున్న రాజుపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో వెనుకనుంచి నరికాడు. మరో సారి మరో వేటు వేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.  తీవ్రంగా గయపడిన రాజును స్థానికులు పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ..
పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి చేయడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ఏం జరుగుతుందోనని కొందరు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాండు రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు వజ్రం పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా రాజు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా