వివాహేతర జంట ఆత్మహత్యాయత్నం

24 Aug, 2018 12:28 IST|Sakshi
కృష్ణ మృతదేహం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుజాత 

సాలూరు విజయనగరం : పట్టణంలోని బంగారమ్మకాలనీకి చెందిన మరిపి కృష్ణ (50), అతని సహజీవని సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులతో పాటు కృష్ణ కుమారుడు శివ తెలియజేసిన వివరాల మేరకు... రెండేళ్ల కిందటి వరకు స్థానిక బెల్లం వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేసిన కృష్ణ తొలి భార్య మరణించడంతో సుజాతకు ఆశ్రయమిచ్చి సహజీవనం చేస్తున్నాడు.

అప్పటికే కృష్ణకు ఇద్దరు కుమారులుండగా, పెద్ద కుమారుడు కొన్నాళ్ల కిందట మృతి చెందాడు. ఇదిలా ఉంటే కంటిచూపు కోల్పోయిన కృష్ణ ఇంటికే పరిమితం కావడంతో కృష్ణ, సుజాతల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరగడంతో, గురువారం వేకువజామున సుజాత ఇంటిలో ఉన్న చీమల మందు తాగింది. వెంటనే శివ గమనించి ఆమెను పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.

ఆమెను పరీక్షించిన వైద్యులు సుజాత ఏమి తాగిందో ఆ సీసాను తీసుకురావాలని కోరడంతో.. శివ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఇంటి దూలానికి వేలాడుతున్న కృష్ణను చూసి అవాక్కయ్యాడు. కొన ఊపిరితో ఉన్న తండ్రిని దించి ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ప్రాణాలొదిలాడు. సుజాత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణ  పోలీసులు కేసున మోదుచేసి విచారణ చేపడుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు