కట్నం కోసం.. అత్త ముక్కు కొరికి, చెవులు కోసి..

26 Aug, 2019 14:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెరోలి: కట్నం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. పైసా ఉంటేనే బంధాలని చెప్తూ మానవ సంబంధాలకు నీళ్లొదులుతున్నారు. మనుషులం అన్న భావన మరిచి రాక్షసులుగా మారుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఆదివారం జరిగిన అమానుష ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. ఎఫ్‌సీఐ ఉద్యోగి రెహమాన్‌ తన కుమార్తె చాంద్‌ బీను.. వ్యాపారి మహమ్మద్‌ అష్ఫఖ్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. కట్నంగా రూ.10 లక్షలు వరుడి కుటుంబానికి ముట్టజెప్పాడు. వారి పెళ్లి జరిగి సంవత్సరం కావస్తోంది. చాంద్‌బీకి కూతురు పుట్టిన క్రమంలో అష్ఫఖ్‌ కుటుంబం మరో రూ.5 లక్షలు తీసుకురావాలని వేధించసాగారు. దీంతో చాంద్‌బీ అత్తింటి వేధింపులను తండ్రికి చెప్పుకుంది. అయితే అదనపు కట్నం ఇచ్చేందుకు రెహమాన్‌ నిరాకరించాడు.

దీంతో అడిగిన కట్నం తీసుకురాలేదని కోపంతో ఊగిపోయిన అష్ఫఖ్‌ భార్యపై దాడి చేసి చిత్రహింసలు పెట్టాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు అష్ఫఖ్‌ కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. గొడవ కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారింది. అయితే ఆ ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన చాంద్‌ బీ తల్లి గుల్షన్‌పై అష్ఫఖ్‌ కుటుంబం దాడి చేసింది. అష్ఫఖ్‌ అత్త ముక్కును కొరకగా, అతని తండ్రి కత్తితో ఆమె చెవి కోశాడు. రక్తం ధారలు కట్టడంతో భయపడిపోయిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరి రాక్షస చర్యతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాగా గాయపడిన మహిళను పరీక్షించిన జిల్లా వైద్యులు బాధితురాలిని సర్జరీ నిమిత్తం ఢిల్లీకి తరలించాలని సూచించారు. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా వారు నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా