దారుణహత్య...వివాహేతర సంబంధమే కారణమా?

14 Jun, 2019 09:59 IST|Sakshi

సాక్షి,వేముల(కడప): మండలంలోని గొల్లలగూడూరు గ్రామంలో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మనోహర్‌రెడ్డి(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మనోహర్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాక ఇంటి ముందు ఆరు బయట నిద్రపోయాడు.

మనోహర్‌రెడ్డి కుమారుడితో కలిసి మంచంపైన.. పక్కనే ఉన్న అరుగుపైన భార్య నిద్రించారు. ఇంటి ముందు మంచంపై నిద్రిస్తున్న మనోహర్‌రెడ్డి తలపై గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికారు. అతని అరుపులు విని పక్కనే అరుగుపై నిద్రిస్తున్న భార్య మేల్కొని చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న మనోహర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. 

మనోహర్‌రెడ్డి హత్యకు వివాహేతర సంబంధమే కారణమా.. : 
గొల్లలగూడూరు గ్రామంలో మనోహర్‌రెడ్డి దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.  గ్రామానికి చెందిన మహిళతో మనోహర్‌రెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. గతంలో కూడా ఈ విషయమై ఘర్షణలు కూడా జరిగినట్లు సమాచారం. దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ చేసి మృతుడిని మందలించినట్లు తెలుస్తోంది. అయినా వివాహేతర సంబంధం కొనసాగించేవాడని.. ఈ నేపథ్యంలో మనోహర్‌రెడ్డి హత్యకు గురి కావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. 

ముగ్గురిపై కేసు నమోదు : 
ఈ హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బాల గంగిరెడ్డి, యుగంధర్‌రెడ్డిలతోపాటు తొండూరు మండలం ఊడవగండ్ల గ్రామానికి చెందిన అంకిరెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా