రూ.50 వేల కోసం మేనత్తను ఆమె ప్రియుడ్ని!!

27 Nov, 2019 06:56 IST|Sakshi
వనిత, కనకరాజ్‌ (ఫైల్‌)

సాక్షి, చెన్నై: తన వద్ద తీసుకున్న అప్పు రూ. 50 వేలు చెల్లించలేదన్న ఆగ్రహంతో మేనత్త అన్న కనికరం కూడా చూడకుండా మేనళ్లుడు కిరాతకాన్ని ప్రదర్శించాడు. తన మిత్రులతో కలిసి ఆమెను హతమార్చడమే కాదు, అడ్డు వచ్చిన ప్రియుడ్ని కడతేర్చాడు. మంగళవారం ఉదయాన్నే తంజావూరు కలెక్టరేట్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తంజావూరు కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా వనిత(42) పనిచేస్తున్నారు. తన భర్త కామరాజ్‌ గతంలో మరణించడంతో కారుణ్య నియామకం కింద వచ్చిన ఉద్యోగంతో పిల్లలు అరవింద్‌ (20), ఆర్తి(17), అరునేష్‌ (16)లతో అక్కడి క్వార్టర్స్‌లో వనతి నివాసం ఉన్నారు. తిరువేడి కుడికి చెందిన కనకరాజ్‌తో ఏర్పడ్డ పరిచయంతో వివాహేతర సంబంధాన్ని వనిత కొనసాగిస్తున్నది.

కనకరాజ్‌కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నా, వనిత ఇంట్లో ఎక్కువ సమయం ఉండే వాడు. తామిద్దరం సహజీనం చేస్తున్నట్టుగా వనిత కలెక్టరేట్‌లోని సహచర సిబ్బంది వద్ద చెప్పుకునేది. ఈపరిస్థితుల్లో   ఏడాదిన్నర క్రితం తన అన్నకుమారుడు ప్రకాష్‌ వద్ద అత్యవసర పని నిమిత్తం రూ. రెండు లక్షలు అప్పును వనిత తీసుకుంది. తిరిగి చెల్లించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు రూ.1.5 లక్షలు చెల్లించగా, మరో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది.
 
రూ. 50 వేల కోసం .. 
తనకు చెల్లించాల్సిన రూ.50 వేల కోసం పలుమార్లు వనిత మీద ప్రకాష్‌ ఒత్తిడి తెచ్చారు. ఆమె ఇవ్వకుండా దాట వేస్తూ వచ్చింది. రెండు రోజుల క్రితం కలెక్టరేట్‌ ఆవరణలో తనకు ఇవ్వాల్సిన డబ్బు కోసం ప్రకాష్‌ నిలదీశాడు. అందుకు అవమాన పరిచే రీతిలో వనిత స్పందించినట్టు సమాచారం. దీంతో కోప్రోదిక్తుడైన ప్రకాష్‌ తనలోని కిరాతకుడ్ని బయటకు తీశాడు. మేనత్త అన్న కనికరం కూడా చూపించకూడదన్న నిర్ణయానికి వచ్చేశాడు. మంగళవారం ఉదయాన్నే తన మిత్రులు సుదీష్‌, మహేష్‌లతో కలిసి కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న గృహ నిర్మాణ శాఖక్వార్టర్స్‌కు వెళ్లాడు. వనిత ఇంటి వద్ద మిత్రులతో కలిసి వెళ్లిన ప్రకాష్‌ కిరాతకాన్ని ప్రదర్శించాడు.

సంఘటన స్థలంలో గుమిగూడిన జనం

ఇంటి బయట ఉన్న వనితను కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఆమె కేకల్ని విన్న కనకరాజ్‌ బయటకు పరుగులు తీసి అడ్డుకునే యత్నం చేశాడు. అయితే, అతడ్ని కూడా వదలిపెట్టకుండా తన మిత్రులతో కలిసి కొట్టి  చంపేశాడు. దీనిని చూసిన పిల్లలు అరవింద్, ఆర్తి, అరునేష్‌ పెట్టిన కేకలతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోవడంతో తన మిత్రులతో ప్రకాష్‌ ఉడాయించాడు. సమాచారం అందుకున్న ఎస్పీ మహేశ్వరన్, డీఎస్పీ రవిచంద్రన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భద్రతతో కూడిన కలెక్టరేట్‌ ఆవరణలోఉన్న క్వార్టర్స్‌లోకి ఆయుధాలతో ఆ నిందితులు ఎలా ప్రవేశించారో అన్న అనుమానాలు బయలు దేరాయి. వీరికి ఎవరైనా సహకరించారా అన్న ప్రశ్నబయలు దేరింది. రూ. 50 వేల కోసం ప్రకాష్‌ తల్లి వద్ద గొడవ పడుతూ వచ్చాడని, ఇప్పుడు హతమార్చి తమను అనాథను చేశాడంటూ పోలీసుల వద్ద వనిత పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా