చల్లని పానీయం ఇచ్చి.. మెల్లగా డబ్బు కొట్టేశాడు

4 May, 2019 07:50 IST|Sakshi
బస్సులో డబ్బు పోగొట్టుకున్న శ్రీనివాస పాణిగ్రహి

జయపురం: రైలులో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది మోసగాళ్లు తోటి ప్రయాణికుల్లా వచ్చి మాటమాట కలిపి మత్తుమందో లేదో మరేదైనా మందు ఇచ్చి దోపిడీ చేసిన ఉదంతాలు విన్నాం. పత్రికల్లో చదువుతున్నాం.ఇటువంటివి రైలు ప్రయాణంలో జరగడం సర్వసాధారణంగా అంతా భావిస్తారు. అయితే ఇటువంటి  సంఘటనలు బస్సులలో   జరగడం సాధారణంగా విని ఉండరు. కానీ అటువంటి అనుభవం జయపురం సమితిలోని కుసుమి గ్రామ వాసి శ్రీనివాస పాణిగ్రహి అనే వ్యక్తికి ఎదురైంది. బస్సులో శ్రీనివాస పాణిగ్రహి పక్క సీటులో కూర్చుని తీపిగా మాట్లాడి, మత్తు మందు కలిపిన చల్లని పానీయం ఇచ్చి శ్రీనివాస పాణిగ్రహి  దగ్గర గల రూ.20 వేలను ఓ దుండగుడు దోచుకుపోయాడు. శ్రీనివాస పాణిగ్రహి విలపిస్తూ ‘సాక్షి’కి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

బరంపురం నుంచి వస్తుండగా..
బుధవారం శ్రీనివాస పాణిగ్రహి కుసుమి గ్రామం నుంచి బరంపురం వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దిగపండి వద్ద బరంపురం–ఉమ్మరకోట్‌ బస్సు ఎక్కి జయపురం టికెట్‌ తీశాడు. టికెట్‌ తీసేందుకు తన వద్ద ఉన్న డబ్బు బయటకు తీసి అందులో టికెట్‌ డబ్బు కండక్టర్‌కు ఇచ్చాడు. తిరిగి జాగ్రత్తగా పాకెట్‌లో డబ్బు భద్రపరిచాడు. అతడు తనకు కండక్టర్‌ చూపిన సీటులో కూర్చున్నాడు. కొంత సమయం తరువాత మరో వ్యక్తి వచ్చి శ్రీనివాస పాణిగ్రహి పక్కన సీటులో కూర్చున్నాడు. తన పక్క సీటులో కూర్చున్న వ్యక్తి కిందికి దిగి ఒక కూల్‌ డ్రింక్‌ను తీసుకు వచ్చి తనకు ఇచ్చాడని దానిని తాను తాగానని శ్రీనివాస పాణిగ్రహి వెల్లడించాడు.

కూల్‌డ్రింక్‌ తాగిన తాను తెలివి తప్పి పడిపోయానని బస్సు  జయపురం చేరిన తరువాత దిగి తన జేబులో డబ్బులు చూడగా డబ్బులేదని వాపోయాడు. తన పక్క సీటులో కూర్చున్న వ్యక్తే తనకు మత్తు పదార్థం కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి తన డబ్బు కాజేశాడని తన డబ్బుతో పాటు మొబైల్‌ ఫోన్‌ను కూడా దుండగుడు దొంగిలించుకు పోయాడని వాపోయాడు. జయపురం బస్సు స్టాండ్‌లో విలపిస్తున్న శ్రీనివాస పాణిగ్రహిని చూసి విషయం తెలుసుకున్న కొంతమంది వెంటనే అతని బంధువులకు  ఫోన్‌ చేసి రప్పించారు. వారు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేసి శ్రీనివాస పాణిగ్రహిని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. ఇటువంటి సంఘటనలు బస్సులలో ఎన్నడూ జరగలేదని బస్సులలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇకపై నైట్‌ బస్సులలో వెళ్లడం  కష్టమేనంటూ   ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు