ప్రేమ పేరుతో మోసం

9 Feb, 2018 08:17 IST|Sakshi
అబ్బాస్‌ జైదీ

సాక్షి హైదరాబాద్,మల్కాజిగిరి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలన్నాడు. మతం మారినా చివరకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దొంగతనం నెపం అంటగట్టాడు. దీనిపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరికి చెందిన యువతి, దారుల్‌సిఫా నూర్‌ఖాన్‌ బజార్‌కు చెందిన సప్దర్‌ అబ్బాస్‌జైదీ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం అబ్బాస్‌ జైదీ దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో అతను అక్కడికి వెళ్లాడు. అనంతరం సదరు యువతి కూడా ఉద్యోగం నిమిత్తం అక్కడికే వెళ్లింది.

మతం మార్చుకుంటేనే తన కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని చెప్పడంతో బాధితురాలు 2014 జులైలో మతం మార్చుకుంది. గత ఏప్రెల్‌ 17న అక్కడే వివాహం చేసుకొని హైదరాబాద్‌లో 28న రిసెప్ఫన్‌ ఏర్పాటు చేద్దామని చెప్పిన అబ్బాస్‌ డిసెంబర్‌ నెలలో తన తల్లిదండ్రులు అంగీకరించనందున పెళ్లి చేసుకోనని చెప్పాడు. అదే సమయంలో అబ్బాస్‌ జైదీ తండ్రి సఫ్దర్‌ అబ్బాస్‌ నాంపల్లిలోని హజ్‌ హౌస్‌కు యువతి తల్లితండ్రులను పిలిపించి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నాడు. గత నెల 29న ఇండియాకు వస్తున్న యువతి తన ల్యాప్‌టాప్‌ దొంగిలించిందని అబ్బాస్‌ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఇమిగ్రేషన్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. ఈ సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించగా అబ్బాయి దుబాయిలో ఉన్నందున కేసు నమోదు సాధ్యం కాదని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని చెప్పాడన్నారు. డీసీపీని కలిసేందుకు ప్రయత్నించగా వేరే దర్యాప్తులో ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారన్నారు. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ కొమరయ్యను వివరణ కోరగా మొదట వచ్చినపుడు కేసు పెట్టడానికి ఇష్ట పడలేదని అబ్బాయి తరుపున వారిని పిలిపించి మాట్లాడమని చెప్పారన్నారు. గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు